తెలుగుదేశం పార్టీ పొత్తులు పెట్టుకుని టీడీపీ జనసేనలకు 31 అసెంబ్లీ సీట్లను కేటాయించింది. ఆ నియోజకవర్గాల్లో టీడీపీని గాలికి వదిలేయకుండా.. హైకమాండ్ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పుడు ఆయా నియోజకవర్గాలకు ఇంచార్జులను నియమించే కసరత్తు ప్రారంభించింది. పోటాపోటీగా జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలతో రాజకీయాలు చేసే వారు కాకుండా.. కలుపుకుని వెళ్లే వారిని ఇంచార్జులుగా పెట్టాలని చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.
పిఠాపురం నియోజకవర్గానికి టీడీపీ ఇంచార్జ్ గా వర్మ కొనసాగనున్నారు. అక్కడ జనసేన పార్టీ గెలిచిన తర్వాత పార్టీలోకి వచ్చిన వారు జనసేన పార్టీ క్యాడర్ గా మారిపోయారు. అయితే వారితో గతం నుంచి వర్మకు రాజకీయ వైరుధ్యం ఉంది. అధికారంలో ఉన్నప్పుడు వారు చేసిన వ్యవహారాలు కొనసాగించడానికే జనసేనలో చేరారన్న ఆరోపణలు ఉన్నాయి. వీరి అక్రమాలను వర్మ ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు కూడా వర్మను కించ పరిచేలా ఉన్నాయని చెబుతున్నారు. అయితే టీడీపీ నాయకత్వం మాత్రం వర్మను ఇంచార్జ్ గా కొనసాగించాలని నిర్ణయించింది.
పిఠాపురం కాకుండా 30 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో దాదాపు సగం నియోజకవర్గాల్లో టీడీపీ నుంచి వెళ్లి జనసేన, బీజేపీల్లో చేరి ఎమ్మెల్యేలు అయిన నేతల నియోజకవర్గాలు ఉన్నాయి. ఇలాంటి చోట్ల ఇంచార్జులను నియమించడం కత్తి మీద సాములాంటిదే. వారి అభిప్రాయంతో .. కలసి పని చేసే వారిని నియమించాల్సి ఉంటుంది. పార్టీ ఆయా నియోజకవర్గాల్లో బలహీనపడకూడదన్న ఉద్దేశంతో ఇంచార్జ్ ల కసరత్తు జరుగుతోంది. కొత్త సమస్యలు రాకుండా.. ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అనుకుంటున్నారు.