ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కేశినేని చిన్ని, కొలికపూడి హాట్ టాపిక్ అయ్యారు. విజయవాడ ఎంపీ, ఆ పరిధిలోకి వచ్చే తిరువూరు అసెంబ్లీకి వీరిద్దరూ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి ఇంచార్జ్ ను కాదని మరీ కొలికపూడికి టిక్కెట్ ఇప్పించారు కేశినేని నాని.ఆయన ను గెలిపించడానికి గట్టి ప్రయత్నాలు చేశారు. గెలిచిన తర్వాత సీన్ మారిపోయింది. ఇద్దరూ మొదటి సారి గెలిచారు. కానీ ఆ గెలుపును ఆధారంగా చేసుకుని బలపడే ప్రయత్నాలు మాత్రం చేసుకోవడం చేత కాలేదు. ఎవరికి వారు వివాదాల్లోకి దిగిపోతున్నారు.
అనుభవ రాహిత్యంతో కొలికపూడి వివాదాస్పద వ్యవహారం
కొలికపూడి శ్రీనివాస్.. పొలిటికల్ సైన్స్ పాఠాలు చెప్పి రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఆయన రాజకీయాలు మాత్రం బేసిక్స్ తెలియని రాజకీయ నాయకుడిలా ఉంటాయి. తిరువూరులో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆయన .. కనీసం తన నియోజకవర్గ రాజకీయాల గురించి .. అక్కడి పొలిటికల్ డైనమిక్స్ గురించి పరిశీలన చేయుకుండా గుడ్డిగా రాజకీయం చేసి వివాదాల పాలయ్యారు. ఎప్పటికప్పుడు దాన్ని ఆయన తన మాటలతో పెంచుకుంటూ పోయారు కానీ కాస్త తగ్గి.. పరిస్థితిని చల్లబరుచుకుందామని ఎప్పుడూ అనుకోలేదు. పార్టీ నాయకత్వం ఆయనకు మూడు, నాలుగు సార్లు చాన్సులిచ్చినా అదే పరిస్థితి.
కొలికపూడిని సున్నితంగా డీల్ చేయలేకపోయిన చిన్ని
కేశినేని చిన్నిపై కొలికపూడి ఆరోపణలు చేయడానికి ప్రధాన కారణం తిరువూరులో తాను ఎమ్మెల్యే అయినప్పటికీ తన ప్రమేయం లేకుండా పార్టీ పదవులు ప్రకటించడం, పనులు చేయించడం. కొలికపూడిని పూర్తిగా పక్కన పెట్టి ప్రత్యామ్నాయ నాయకత్వానని పెంచాలని ఆయనకు హైకమాండ్ సూచనలు ఇచ్చి ఉంటుంది. దాన్ని డీల్ చేయాలంటే.. కొలికపూడిని రెచ్చగొట్టే విధంగా చేయడం కాదు. జవహర్ ను తీసుకు వచ్చి వచ్చే ఎన్నికల్లో ఆయనే పోటీ చేస్తారని ప్రచారం చేయడం.. కొలికపూడికి సమాచారం లేకుండా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఆయన ఆరోపణలు చేయడం ప్రారంభించారు. అదే ఆయనను పిలిచి ఉంటే.. సమస్యలు వచ్చేవి కావు.
రాజకీయాలు ఎవరూ నేర్పరు.. అదే పనిగా అవకాశాలు రావు !
కేశినేని నాని దుందుడుకు వైఖరి.. ఎంపీగా గెలిచిన తర్వాత ఆయన వ్యవహారం నచ్చకపోవడం అదే సమయంలో.. కేశినేని చిన్నీని టీడీపీలో ప్రోత్సహించారు. ఆ అవకాశాన్ని ఆయన అంది పుచ్చుకోవాల్సి ఉంది. కానీ ఆయనపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీ నేతలతో ఆయనకు ఉన్న లింకులుపై తరచూ వివరాలు బయటకు వస్తున్నాయి. కొలికపూడి జగన్ ప్రోత్సహించకపోయినా చంద్రబాబు పిలిచి టిక్కెట్ ఇచ్చారు. వీరిద్దరికి మొదటి సారి వచ్చిన అవకాశాలతోనే విజయం సాధించారు. అవకాశాలు మళ్లీ మళ్లీ రావు. ఆ విషయం వీరికి తెలియదు. రాజకీయాలు ఒకరు నేర్పరు.. నేర్చుకునే శక్తి ఉంటేనే ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉండగలుగుతారు.
