ఇంత ఆల‌స్యంగా స్పందిస్తే ఎలా రావుల‌..?

తెలంగాణ‌లో టీడీపీ ఉందా, ఆ పార్టీలో నాయ‌కులు ఉన్నారా..? ఎందుకు లేరు, ఉన్నారు. అయితే, క‌నిపించ‌రేం, మాట్లాడ‌రేం, మున్సిప‌ల్ ఎన్నిక‌లు ముంచుకొస్తున్నా ఏం చేస్తున్నారు..? తెలంగాణ‌లో పార్టీని పున‌రుద్ధ‌రించాల‌ని ఈ మ‌ధ్య‌నే క‌దా నిర్ణ‌యించుకున్నారు. పొత్తుల జోలికి వెళ్ల‌కుండా, సొంతంగానే మ‌రోసారి ముందుకెళ్దామ‌ని ఇటీవ‌లే క‌దా డిసైడ్ అయిపోయారు. అలాంట‌ప్పుడు, కార్యాచ‌ర‌ణ ఎలా ఉండాలి..? అదే క‌నిపించ‌డం లేదు! ప్ర‌తిప‌క్ష పార్టీలుగా కాంగ్రెస్, భాజ‌పాలు తెలంగాణ‌లో ప‌డుతున్న ప‌రిస్థితి. అవ‌కాశం దొర‌క‌‌డమే ఆల‌స్యం అన్న‌ట్టుగా ఆ రెండు పార్టీలూ కేసీఆర్ స‌ర్కారు మీద విమ‌ర్శ‌లు, ఉద్య‌మాలు, నిర‌స‌న‌లంటూ హ‌డావుడి చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో టీడీపీ బాగా వెన‌క‌బ‌డిపోయింది.

గురువారం నాడు ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్లో ఒక ప్రెస్ మీట్ పెట్టారు టీడీపీ నేత‌లు. దీన్లో సీనియ‌ర్ నేత రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి మాట్లాడుతూ… ఆర్టీసీ ఛార్జీలు పెంచేసి, ప్ర‌జ‌ల‌పై కేసీఆర్ స‌ర్కారు భారం మోపింద‌న్నారు. సామాన్యులు, పేద‌ల్ని ఇబ్బందులుపెడుతున్నార‌న్నారు. నిత్యావ‌స‌ర ధ‌ర‌లు ఇష్టం వ‌చ్చిన‌ట్టుగా పెంచుకుని పోతున్నార‌న్నారు. ఆర్థిక‌మాంద్యం పేరుతో బ‌డ్జెట్లో కోత పెట్టార‌న్నారు. ఆర్థిక భారాన్ని త‌గ్గించుకునేందుకు ప్ర‌జ‌ల‌పై దాన్ని నెట్టేస్తోంద‌ని విమ‌ర్శించారు. పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు, నిత్యావ‌స‌రాల‌తోపాటు మ‌రికొన్ని అంశాల‌పై చ‌ర్చించేందుకు ఈ నెల 23న రౌండ్ టేబుల్ స‌మావేశం నిర్వ‌హిస్తున్న‌ట్టు చెప్పారు.

తెలంగాణ‌లో సామాన్యుల‌ను ప్ర‌భావితం చేసే అంశాలు చాలానే ఉన్నాయి. ఆర్టీసీ ధ‌ర‌లుగానీ, నిత్యావ‌స‌రాల ధ‌ర‌లుగానీ, దిశ ఘ‌ట‌న నేప‌థ్యంలో మ‌హిళ‌ల‌ భ‌ద్ర‌త‌పై ఆగ్ర‌హంగానీ… ఇలా చాలానే చ‌ర్చ జ‌రుగుతోంది. కేసీఆర్ రెండో ట‌ర్మ్ ఏడాది పూర్తి చేసుకున్నా రాష్ట్రంలో చెప్పుకోద‌గ్గ అభివృద్ధి సాధించామ‌ని తెరాస నాయ‌కులే మాట్లాడ‌లేని ప‌రిస్థితి ఉంది. ధ‌నిక రాష్ట్రంగా ఏర్ప‌డి, ఇప్పుడు ఆర్థికంగా వెన‌క‌బ‌డిన రాష్ట్రంగా మారింద‌ని ప్ర‌భుత్వ‌మే చెబుతున్న ప‌రిస్థితి. వీట‌న్నింటిపై ఉద్య‌మిస్తే… రాజ‌కీయంగా టీడీపీకి క‌లిసొచ్చే అంశ‌మే అవుతుంది. రాష్ట్రంలో పార్టీకి పున‌ర్వైభ‌వం తెస్తామంటూ… అవ‌స‌ర‌మైన ఇలాంటి సంద‌ర్భాల్లో ఆల‌స్యంగా స్పందిస్తూ పోతే ఎలా..? మ‌ద్యం నిషేధించాలంటూ భాజ‌పా ఉద్య‌మిస్తున్న త‌రువాత‌, తెలంగాణ బ‌చావో అంటూ కాంగ్రెస్ సిద్ధ‌మైపోయిన త‌రువాత‌… ఆల‌స్యంగా కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తామంటే ఏం ఉప‌యోగం..? ఇంత ఆల‌స్యంగా స్పందిస్తుంటే… ఇన్నాళ్లూ ఈ పార్టీ నాయ‌కులు ఏమైపోయారు, తీరిగ్గా ఇప్పుడు మాట్లాడుతున్నారే అనే అభిప్రాయం ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌దా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com