ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం.. భారతీయ జనతా పార్టీ, జనసేన పొత్తులు పెట్టుకోవడం. ఈ పరిణామాన్ని టీడీపీ మరో రకంగా వినియోగించుకుంది. బీజేపీని కార్నర్ చేయడానికి వాడుకుంటోంది. రాజకీయ పరంగా కాకుండా..రాజధాని విషయంలో .. బీజేపీపై ఒత్తిడి పెంచే ఓ అవకాశం.. కొత్త పొత్తుల వల్ల.. తమకు దొరికిందని.. టీడీపీ భావిస్తోంది. భారతీయ జనతా పార్టీ.. అమరావతి తరలింపును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ విషయంపై.. ఆ పార్టీ రాష్ట్ర శాఖ తీర్మానం కూడా చేసింది. రైతుల కోసం పాదయాత్ర చేస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. నిజానికి బీజేపీ తల్చుకుంటే… రాజధాని తరలింపు సాధ్యం కాదని.. ప్రజలందరూ నమ్ముతున్నారు. కేంద్రంలో ఉన్న అధికార పార్టీగా .. బీజేపీకి కూడా ఈ విషయంలో క్లారిటీ ఉంది.
ప్రజలు ఆశలు పెంచుకోకుండా.. రాజధాని అనేది.. రాష్ట్ర పరిధిలోని అంశమని.. కేంద్రం జోక్యం చేసుకోదని చెబుతూ వస్తున్నారు. జనసేనతో పొత్తు పెట్టుకున్న తర్వాత.. అమరావతి విషయంలో కలిసి పోరాడుతామని చెప్పిన తర్వాత .. టీడీపీ అడ్వాంటేజ్ తీసుకునేందుకు సిద్ధమయింది. ఏపీ రాజధాని అంశంలో.. కేంద్రానికి సంబంధం లేదంటున్న బీజేపీ నేతలను.. మొదటి సారిగా.. టీడీపీ టార్గెట్ చేసింది. బీజేపీ, జనసేన పొత్తుతో అంతిమంగా రాష్ట్రానికి మేలు జరగాలని ప్రజలు కోరుకుంటున్నారని.. టీడీపీ చెబుతోంది. రాష్ట్రానికి న్యాయం చేయగలిగే స్థాయిలో బీజేపీ ఉందని.. ఆ పార్టీ నేత, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. కేంద్రానికి అంతా తెలిసే జరుగుతోందన్న అనుమానాలను కూడా పయ్యావుల వ్యక్తం చేశారు.
కేంద్రం చేతుల్లో ఉన్న హైకోర్టు మార్పు ప్రకటనను ఎందుకు ఖండించలేదని పయ్యావుల ప్రశ్నించారు. అమరావతి విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం వైఖరి అలాగే ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్రానికి చెప్పకుండా ఏదీ చేయడం లేదని విజయసాయి చేసిన ప్రకటన.. కేంద్రంలోని పెద్దల మద్దతుతోనే రాజధాని మార్చుతున్నట్లు వైసీపీ నేతలు వారి అంతర్గత సమావేశాల్లో పేర్కొంటున్నారన్న విషయాన్ని పయ్యావుల వివరించారు. బీజేపీ తల్చుకుంటే.. అమరావతి సమస్య వారికి అతి చిన్నదని, ఈ విషయంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని టీడీపీ డిమాండ్ చేసింది. విమర్శలు కానట్లుగా.. టీడీపీ చేసిన విమర్శలపై.. బీజేపీ స్పందించాల్సి ఉంది.