తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులుగా బరిలోకి దిగి ఇరవై పంచాయతీల్లో కార్యకర్తలు గెలిచారు. అవి ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబ్ నగర్ వంటి జిల్లాల్లోనూ ఉన్నాయి. ఈ జాబితాను తెలుగుదేశం పార్టీ అధికారికంగా విడుదల చేసింది. అసలు పంచాయతీ ఎన్నికలను పట్టించుకోని పార్టీ విజయాలను మాత్రం చెప్పుకునేందుకు ఆసక్తి చూపించింది. పార్టీ నాయకత్వం తెలంగాణలో పార్టీని నిర్లక్ష్యం చేస్తోందన్న అసంతృప్తి క్యాడర్ లో ఉన్నా.. ఈ ఫలితాలు టీడీపీ క్యాడర్ పార్టీ అనే అంశాన్ని మరోసారి రుజువు చేసిందని సంతృప్తి పడుతున్నారు.
టీడీపీ క్యాడర్ పార్టీ
తెలుగుదేశం పార్టీ అంటే క్యాడర్ పార్టీ అని చెబుతూ ఉంటారు. ఆ పార్టీ తరహాలో పార్టీని బలోపేతం చేసుకోవాలని కేసీఆర్ సహా చాలా మంది తమ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన ఘటనలు ఉన్నాయి. ఇదే విషయాన్ని టీడీపీ క్యాడర్ మరోసారి నిరూపించింది. తెలంగాణలో హోరాహోరీగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ఇరవై పంచాయతీలను కైవసం చేసుకున్నారు. మామూలుగా అయితే ఇది పెద్ద విషయం కాదు. కానీ వారు పార్టీని వదిలి పెట్టకుండా… పార్టీ మద్దతుదారులుగానే ప్రచారం చేసి విజయం సాధించడమే అసలైన విశేషం.
పార్టీ మద్దతు ఉంటే మెరుగైన ఫలితాలు వచ్చేవి !
టీడీపీ పార్టీ హైకమాండ్ కాకపోయినా కనీసం కింది స్థాయి నేతలు తెలంగాణలో ఇప్పటికీ పార్టీకి మిగిలి ఉన్న క్యాడర్ కు సపోర్టు చేసి ఉంటే పంచాయతీ ఎన్నికల్లో మరిన్ని మెరుగైన ఫలితాలు వచ్చి ఉండేవని ఎక్కువ మంది భావన. కానీ తెలుగుదేశం నాయకత్వం తెలంగాణలో టీడీపీని పట్టించుకోవడంలేదని మానేసింది. కాసాని పార్టీకి రాజీనామా చేసిన తర్వాత అధ్యక్షుడ్ని కూడా నియమించలేదు. నిజానికి టీడీపీ పార్టీకి మంచి ఆదరణ ఉన్న నేతలు ఉన్నారు. అమీన్పూర్ లాంటి మున్సిపాలిటీల్లో పార్టీ పట్టించుకోనప్పుడు.. బీఆర్ఎస్ పార్టీ దూకుడు మీద ఉన్నప్పుడే రెండు కౌన్సిలర్ సీట్లు వచ్చాయి. దృష్టి పెడితే ఇంకా ఎక్కువే వస్తాయి.కానీ పార్టీ వ్యూహం వేరే ఉంది.
తెలంగాణలో పార్టీని ట్రాక్ లోకి తేవడం కష్టమే !
ప్రస్తుతం తెలంగాణలో రాజకీయసమీకరణాలను .. విశ్లేషించుకుంటున్నారు. ఏపీపై ప్రభావం లేకుండా పార్టీని బలపరచాలా అలా.. అసాధ్యమవుతుందా అన్నదానిపై ఇంకా నిర్ణయానికి రాలేకపోతున్నారు. టీడీపీ పార్టీ పోటీ చేయడం వల్ల కొన్ని పార్టీలు.. పోటీ చేయకపోవడం వల్ల కొన్ని పార్టీలకు మేలు జరుగుతోంది. ఇరవై పంచాయతీలు గెలిచారని మళ్లీ ఆదరణ లభిస్తుందని ఆవేశ ఆడాల్సిన అవసరం లేదు కానీ.. క్యాడర్ కు ఎంతో కొంత ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం మాత్రం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
