తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ తనను తాను బీసీ సేవియర్ గా చిత్రీకరించుకునేందుకు చేసిన ప్రయత్నాలు రివర్స్ అయ్యాయి. తన కార్యాలయం ముందు వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే దానికి బీసీ రిజర్వేషన్ల కలరింగ్ ఇచ్చారు. కానీ అసలు విషయం బయటకు వచ్చే సరికి ఆయన షివరింగ్ అవుతున్నారు. వాటి గురించి ప్రచారం చేస్తున్న యూట్యూబ్ చానళ్లను బెదిరిస్తున్నారు.దీంతో ఇప్పుడు ఈ వివాదం అంతకంతకూ పెరిగి పెద్దదవుతోంది.
మల్లన్న పరువు తీశాడనే చారి ఆత్మహత్య
బీసీ రిజర్వేషన్ల కోసం చనిపోయాడని ప్రచారం చేసిన వ్యక్తి ఆత్మహత్యకు అసలు కారణం వేరే. ఆయనేమీ ప్రభుత్వ ఉద్యోగాల కోసం లేదా రాజకీయ రిజర్వేషన్ల కోసం పోరాటం చేయడం లేదు. డ్రైవర్ గా పని చేసి ఉపాధి పొందుతున్నారు. ఆయన భార్య తీన్మార్ మల్లన్న కార్యాలయానికి వచ్చే వారికి ఆర్థిక సాయం చేస్తున్నారని తెలిసి వెళ్లి అడిగింది. ఇరవై వేలు ఇచ్చిన మల్లన్న ఆ ఎపిసోడ్ మొత్తాన్ని వీడియో తీసి ప్రచారం చేసుకున్నారు. దాంతో పరువు పోయింది ఆ వ్యక్తి తీన్మార్ మల్లన్న కార్యాలయం ముందే ఆత్మహత్యాయత్నం చేశాడు. జరిగింది ఇది అయితే.. ఈ ఆత్మహత్యకు .. బీసీ రిజర్వేషన్ల కలరింగ్ ఇచ్చారు.
ఇదేదో బాగుందని అన్ని పార్టీల హడావుడి
బీసీ రిజర్వేషన్ల కోసం ఆత్మహత్యఅని ప్రచారం చేయగానే.. చాలా పార్టీలు చివరికి కవిత, కేటీఆర్ కూడా స్పందించారు. ఇది తెలంగాణ బీసీ యువతపై వేస్తున్న ఆత్మహత్యల ట్రాప్ గా అనుమానాలు ప్రారంభమయ్యాయి. అయితే పోలీసుల విచారణలో అసలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో కంగారు పడిన తీన్మార్ మల్లన్న.. మరింత కుల రాజకీయం చేస్తున్నారు. ఆయన ఆ కుటుంబం పరువు తీయడం చట్టపరంగా నేరంగా నిలబడకపోవచ్చు కానీ ఓ కుటుంబాన్ని రోడ్డున పడేసింది మాత్రం ఆయనేనని అందరికీ తెలిసిపోయింది.
మల్లన్న వ్యవహారాలపై ఇప్పటికే అనేక ఆరోపణలు
తీన్మార్ మల్లన్న వ్యవహారాలపై ఇప్పటికే చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆయన పెద్ద ఎత్తున బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడి డబ్బులు వసూలు చేస్తారన్న ఆరోపణలు చాలా సార్లు ఎదుర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో కేసుల పాలయ్యారు. జైల్లో చాలా కాలం ఉన్నారు. ఇప్పుడు ఆయనపై అలాంటి కేసులు నమోదు కావడం లేదు కానీ బీసీల పేరుతో చేస్తున్న రాజకీయం మాత్రం వివాదాస్పదం అవుతోంది.
