తెలంగాణ రాజకీయాల్లో తనదైన శైలిలో బీసీ రాజకీయాలు చేస్తూ, సోషల్ మీడియా వేదికగా హడావుడి చేసే తీన్మార్ మల్లన్నకు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కోలుకోలేని దెబ్బ తీశాయి. కొత్త పార్టీ పెట్టి, కులాల వారీగా నేతలను టార్గెట్ చేస్తూ ముఖ్యమంత్రి పదవే ధ్యేయంగా రాజకీయం చేస్తున్న మల్లన్నను ప్రజలు కనీసం ఒక రాజకీయ ప్రత్యామ్నాయంగా కూడా గుర్తించలేదని ఈ ఎన్నికలు నిరూపించాయి. ఆయన పార్టీ ఎన్నికల బరిలో ఉందనే విషయం కూడా చాలా మంది ఓటర్లకు తెలియకపోవడం, చివరకు కనీసం ఒక్క కౌన్సిలర్ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోవడంతో మల్లన్న యూట్యూబర్ స్థాయిలోనే ఉండిపోయారని అనుకోచ్చు.
రాష్ట్ర రాజకీయాల్లో ఉనికి కోసం పోరాడుతున్న ఇతర పార్టీలు మెరుగైన ప్రదర్శన కనబరిచాయి. కవిత మద్దతుదారులు సింహం గుర్తుపై పోటీ చేసిన ప్రభావం చూపారు. జనసేన పార్టీ కూడా కొన్ని చోట్ల తన ప్రభావాన్ని చాటుకుని ఉనికిని చాటుకుంది. కానీ, నిత్యం వార్తల్లో నిలుస్తూ, తాను బీసీల ఛాంపియన్ అని ప్రకటించుకునే మల్లన్న పార్టీ మాత్రం కనీస ప్రభావం చూపలేకపోయింది. ఇది ఆయన వ్యక్తిగత ఇమేజ్ ఓట్లుగా మారడం లేదని స్పష్టం చేస్తోంది.
రాజకీయ ప్రయాణంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి దూరమవ్వడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేయడంతో మల్లన్న రాజకీయంగా ఒంటరయ్యారు. కేవలం విమర్శలకే పరిమితమై .. కులాల పేరిట రాజకీయం చేస్తూంటే ప్రజలు కూడా పట్టించుకోరు. , కేవలం సోషల్ మీడియా వేదికగా చేసే గొంతు చించుకునే ప్రసంగాలు ఓట్ల వర్షం కురిపించలేవని ఈ ఫలితాలు తేల్చిచెప్పాయి. ఇప్పుడు ఆయన మళ్లీ కాంగ్రెస్ తో సన్నిహితమవుతారా లేకపోతే.. ఇదే రకంగా కంటిన్యూ అవుతారా అన్నది ఆయన తేల్చుకోవాల్సి ఉంది.