‘హనుమాన్’ ఊహించని విజయాన్ని అందుకొంది. ఆ తరవాత.. తేజా సజ్జా ఎలాంటి సినిమా చేస్తాడో అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. తేజా కూడా చాలా తెలివిగా ‘హనుమాన్’ ఎలాంటి విజువల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిందో.. సరిగ్గా అలాంటి అనుభూతి కలిగించే కథని ఎంచుకొన్నాడు ‘మిరాయ్’ రూపంలో. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రూపొందించిన చిత్రమిది. దాదాపు రూ.60 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందింది. సెప్టెంబరు 12న విడుదల చేస్తున్నారు. ఈరోజు ట్రైలర్ వదిలారు.
3 నిమిషాల ట్రైలర్లో.. మాట్లాడుకోవడానికి చాలా విషయాలే ఉన్నాయి. ఈ సినిమా కథేమిటన్నది టీజర్లోనే చెప్పారు. ట్రైలర్ లో మరింత క్లారిటీ దొరికింది. చాలా పాత్రలు రివీల్ అయ్యాయి.
”ఈ ప్రమాదం ప్రతీ గ్రంధాన్నీ చేరబోతోంది. దాన్ని ఆపడానికి నువ్వు మిరాయ్‌ని చేరుకోవాలి”.
”నువ్వు అనుకొంటున్న మనిషీ అడ్రస్సు నేను కాదు”.
”ఈ దునియాలో ఏదీ నీది కాదు భయ్యా.. అన్నీ అప్పే.. ఈ రోజు నీదగ్గర, రేపు నా దగ్గర”
”నా గతం.. నా యుద్ధం.. నా ప్రస్తుతం ఊహాతీతం”
”తొమ్మిది గ్రంధాలూ వాడికి దొరికితే పవిత్ర గంగలో పారేది రక్తం..”
”ఇదే చరిత్ర… ఇది భవిష్యత్తు.. ఇదే మిరాయ్..” – ఈ డైలాగులతో ఈ కథ నేపథ్యం ఏమిటో అర్థమైపోతోంది.
చాలా విజువల్స్ అవుట్ స్టాండింగ్ అనిపించాయి. ఈ బడ్జెట్ లో ఇంత క్వాలిటీ మేకింగ్ తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. డ్రాగన్ తో చేసే ఫైట్, చివర్లో శ్రీరాముడి దర్శనం ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. అన్నీ అనుకొన్నట్టు కుదిరితే.. తేజా సజ్జాకు మరో పాన్ ఇండియా హిట్ దొరకడం ఖాయం అనిపిస్తోంది. ఇప్పటికే ఓటీటీ డీల్స్ క్లోజ్ అయిపోయాయి. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో దాదాపు రూ.40 కోట్లు వచ్చినట్టు టాక్. మరో 20 కోట్లు థియేటర్ నుంచి రాబట్టుకోవాలి. ఈ ట్రైలర్ చూస్తే… అదేమంత కష్టం కాదనిపిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈమధ్య చాలా సినిమాలు చేసింది. అన్నీ నష్టాలే తెచ్చాయి. ‘మిరాయ్’ మాత్రం ఈ సంస్థకు లాభాలు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది.