సినిమా ఇండస్ట్రీలో జడ్జ్మెంట్ చాలా ప్రధానం. ఏ సినిమా చేయాలి? ఎలాంటి సినిమా చేయాలి? ఎవరితో చేయాలి? అనే విషయాల్లో జడ్జిమెంట్ అవసరం. స్నేహాల కోసం, పారితోషికాల కోసం సినిమాలు చేస్తే కెరీర్లు నాశనం అయిపోతాయి. ఈ విషయంలో తేజా సజ్జాని మెచ్చుకొని తీరాలి. తానెప్పుడూ పారితోషికాల కోసం వెంపర్లాడలేదు. క్రేజీ కాంబినేషన్ల మోజులో పడిపోలేదు. ‘హనుమాన్’ తరవాత తనకు వంద ఆఫర్లు వచ్చాయి. కానీ ‘మిరాయ్’లాంటి సినిమా చేశాడు. ‘మిరాయ్’ తరవాత కూడా చాలా కథలే విన్నాడు. కానీ దేనికీ తలొగ్గలేదు. ఈ గ్యాప్ లో తాను రిజెక్ట్ చేసిన కథలెన్నో. ఇటీవల విడుదలైన ‘ఫంకీ’ కథ కూడా ముందు తేజానే విన్నాడు. కానీ ‘నో’ చెప్పాడు. ఇలాంటి కథ తనకు సరిపడదని తప్పించుకొన్నాడు. తన జడ్జిమెంట్ నిజమైంది. ‘ఫంకీ’ డింకీ కొట్టింది.
నిజానికి అనుదీప్ తనకు మంచి మిత్రుడు. ఇద్దరూ చాలా క్లోజ్. అనుదీప్ రాసుకొన్న కథలన్నీ తేజా వింటాడు. `జాతిరత్నాలు` కూడా తేజా విన్నాడు. కానీ చేయలేదు. ఆ ప్రాజెక్ట్ లోకి నవీన్ పొలిశెట్టి వచ్చాడు కాబట్టి, తన కామెడీ టైమింగ్ తో ముందుకు తీసుకెళ్లాడన్నది తేజా నమ్మకం.నిజమే.. ఆ కథలో నవీన్ ని తప్ప మరెవర్నీ ఊహించలేం. తేజా సజ్జా చేసి ఉంటే ‘జాతిరత్నాలు’ అంత పెద్ద హిట్ అయ్యేది కాదేమో. ఇప్పుడు `ఫంకీ` కూడా అంతే. కథలో ఏమాత్రం దమ్ము లేకుండా కేవలం మాటలతో గారడీ చేద్దామనుకొన్నారు. ఫలితం రాలేదు. తేజా ఈ సినిమాని వదులుకొని చాలా మంచి పనే చేశాడు. ఫ్రెండ్ చెప్పాడు కదా అని కమిట్ కాలేదు. లేదంటే.. తన విజయ పరంపరకు ఈ సినిమాతో బ్రేక్ పడేది.


