తెలకపల్లి రవి : అమిత్‌షాకు శరణమివ్వని అయ్యప్ప!

శబరిమల సమస్య ఆధారంగా కేరళలో సిపిఎం నాయకత్వంలోని వామపక్ష ప్రభుత్వాన్ని దెబ్బ తీయొచ్చని బిజెపి ఆరెస్సెస్‌లు పన్నిన వ్యూహం విఫలమైంది. అంతకు ముందు వరద సహాయంలోనూ వక్రరాజకీయమే నడిచింది. చెప్పాలంటే ఈ సంక్షోభాలను ఎదుర్కోవడమే గాక ప్రజలను నిలబెట్టి రాజకీయ ధైర్యం ఇవ్వడంలో ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ బలమైన నాయకుడుగా ఎదిగారని మింట్‌ పత్రిక ప్రశంసించింది. గతసారి దర్శనానికి వచ్చిన మహిళలను అడ్డుకుంటున్న పరివార్‌ శక్తులపట్ల సంయమనం చూపించిన ఎల్‌డిఎప్‌ ప్రభుత్వం తర్వాత వారిని గుర్తించి మరీ అరెస్టు చేసింది. దీనిపై హైకోర్టు పిటిషన్‌ తీసుకోవడంతో తమ పంట పండిందని బిజెపి భావించింది.కాని తీరా చూస్తే హైకోర్టు ప్రభుత్వాన్ని అభినందించింది. శబరిమలకు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు తీసుకుంటున్న చర్యలు భేషుగ్గా వున్నాయన్నది. సరిగ్గా ఈ తీర్పుపైనే బిజెపి అద్యక్షుడు అమిత్‌ షా దాడి చేసిన తీరు చూశాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోస్తామని బెదిరించి తమ నిరంకుశ స్వభావం బయిటపెట్టుకున్నారు.

శబరిమలకు స్త్రీలందరినీ అనుమతించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు తరతరాల విశ్వాసాలకు విఘాతమని సంఘ పరివార్‌ గగ్గోలు పెడుతున్నది. కాని వాస్తవం ఏమంటే 1991 వరకూ అక్కడకు అందరు మహిళలూ వెళ్లేవీలుండేది. మెట్లపై సినిమా షూటింగులు కూడా జరిగేవి. గుడికి ఆధ్వర్యం వహించిన పండలం రాజమాత కూడా దర్శించేవారు. రాకపోకలు కష్టం గనకనే స్త్రీలు తక్కువగా వచ్చేవారని, ఇప్పుడు ఆ సంఖ్య పెరిగిందని 1991లో ఈ విషయమై పిటిషన్‌ విచారించిన హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇంతకూ మహిళలను అడ్డుకోవాలని పిటిషన్‌ వేసిన వ్యక్తి ఆరెస్సెస్‌ వారే. సందర్శకుల సంఖ్య బాగా పెరిగింది గనక స్త్రీలు వస్తే ఇబ్బంది అన్న కోణంలో హైకోర్టు తీర్పునిచ్చింది తప్ప 10 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు వారు రాకూడదన్న భావన పిటిషన్‌ వేసిన వారిదే. ఇక ఈ తీర్పు వచ్చాక 2007లో అందుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టుకువెళ్లిన ప్రేమకుమారి మరో ఇద్దరు మహిళలు కూడా బిజెపి అనుయాయులే . అప్పుడు కూడా ఆరెస్సెస్‌ వారిని సమర్థించింది. మరోవైపు ఎల్‌డిఎప్‌ మహిళల ప్రవేశాని సమర్తించగా కాంగ్రెస్‌ యుడిఎప్‌ వ్యతిరేకించింది. 2018లో సుప్రీం కోర్టు మహిళలను అనుమతించాలని తీర్పునిచ్చినప్పుడు ఆరెస్సెస్‌, సిపిఎం కాంగ్రెస్‌ కూడా సమర్తించాయి. తర్వాతనే బిజెపి కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు ప్లేటు ఫిరాయించారు. తీర్పు అమలు చేయొద్దని ఆరెస్సెస్‌ రంగంలోకి దిగింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తీర్పు ప్రకారం వచ్చే మహిళా భక్తులకు రక్షణ కల్పిస్తానని మాత్రమే చెప్పింది. కేవలం రాజకీయ కారణాలతో ఎవరైనా వస్తే వారికి రక్షణ ఇవ్వబోమని ఇది బలాబలాలు తేల్చుకునే చోటు కాదని స్పష్టంగా చెప్పింది. కేరళలో వేలమంది మహిళలను అక్కడకు పంపి అనుకున్నది సాధించడల శక్తి కమ్యూనిస్టులకు వుందని దేశమంతటికీ తెలిసినా నిగ్రహం పాటించింది. పూర్తి వాస్తవాలు అధ్యయనం చేయకుండా ఇది అవకాశవాదంగా నిందించిన వారు కూడా వున్నాపట్టించుకోలేదు. భక్తి విశ్వాసాలు సున్నితమైనవన్న అవగాహన గౌరవం వుండటమే ఇందుకు కారణం. వాస్తవానికి కేరళలో శబరిమల క్షేత్రం ఇంత కాలం దేదీప్యమానంగా కొనసాగుతున్నా కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఎన్నడూ దానికి భంగం కలిగించలేదు. ఇప్పుడు కూడా కొండపై పెద్ద సంఖ్యలో తిష్టవేసి అలజడి సృష్టించేందుకు ప్రయత్నించింది బిజెపి వారే. ఆ పథకాన్ని విఫలం చేయడంతో అమిత్‌ షా రంగంలోకి దిగి రాజకీయ బెదిరింపులకు పాల్పడ్డారు. కాని దేశంలోనే తొలిసారి ఇఎంఎస్‌ నంబూద్రిప్రాద్‌ ప్రభుత్వ బర్తరఫ్‌ను చూసిన కమ్యూనిస్టులకు ఇదేమీ కొత్త కాదు. తన గత తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు వచ్చే వారం చేపట్టనుంది. ఈ లోగా రాస్ట్ర ప్రభుత్వం చాలా పకడ్బందీగా ముందకు పోతున్నది. ఈ సారి మాత్రం ఆరెస్సెస్‌ పాచికలు పారే అవకాశమే వుండకపోవచ్చు. బహుశా అమిత్‌షాకు అయ్యప్ప శరణమివ్వలేదన్నమాట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here