తెలకపల్లి రవి : పవన్‌కు కుతకుత ఎందుకు, ఎబిఎన్‌?

ఇప్పుడు సోషల్‌ మీడియాలోనూ ప్రధాన మీడియాలోనూ కూడా షాక్‌, సంచలనం అన్నవి వూతపదాలుగా మారాయి. వాస్తవానికి వాటి పదును పోగొట్టుకున్నాయని చెప్పాలి. ఇప్పుడు కుతకుత కూడా అలాటి వాటికి కలపాల్సి వచ్చేట్టుంది. బిఎస్‌పి అధినేత మాయావతితో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ బాబు దెబ్బకు కుతకుతలాడిపోతున్నాడని ఎబిఎన్‌ ఒక కథనం ఇచ్చింది. చంద్రబాబు జాతీయ రాజకీయాల కోసం మాయావతిని కలిశారని మీడియా కథలు గుప్పించింది. ఆమె ఆయనపై చూపిన అభిమానం ప్రత్యేకంగా చెప్పుకున్నారు. అయితే ఇందులో పవన్‌ కోణం ఒకటుందని నేను తెలుగు360లో రాశాను. లక్నో వె ళ్లిన పవన్‌ను మాయావతి అవకాశం వుండి కలుసుకోలేదా అన్నది పరిశీలించాల్సిన విషయం. పైగా ముందెన్నడూ కలవరనీ లేదు. అయితే పవన్‌ పర్యటన తర్వాతనే చంద్రబాబు ఆమెను కలిశారన్నది నా వ్యాఖ్యానం. ఆమెను కాంగ్రెస్‌కు దూరం గాకుండా చూసేందుకు చంద్రబాబ వెళ్లారని టిడిపి కథనం నిజమే కావచ్చు గాని ఈ కోణం విస్మరించడానికి లేదు. చంద్రబాబుకు మాయావతి ఇచ్చిన మర్యాదకు పవన కళ్యాణ్‌ కుతకుత ఉడికిపోయి వంటరిపోటీల ట్వీట్‌ చేశారని ఎబిఎన్‌ ఇచ్చిన కథనం పరోక్షంగా నా వాదనను సమర్థించింది. అయితే మాయతో మాట్లాడ్డమే జరగనప్పుడు ఆమెకు ఈ ట్వీట్‌ ఎలా వర్తిస్తుంది? వామపక్షాల నేతలు దీంతో కంగు తిన్నాయని కూడా ఆకథనం చెబుతుంది. కలసి వెళ్తారనే సాధారణ భావన తప్ప ఇంతవరకూ వారు ఆయనతో ఎన్నికల చర్చలు జరిపిందే లేదు. వంటరిగా వెళతానని అంతకుముందు ఉత్తరాంధ్రలో పవన్‌ చేసిన వ్యాఖ్య కూడా వారికి తెలియంది కాదు. కాబట్టి స్పష్టత కోసం చూడటం తప్ప వారొ అంత తబ్బిబ్బయ్యేదేమీ లేదు. గతంలోనే ముఖ్యమంత్రులుగా పనిచేసి జాతీయ రాజకీయాల్లోనూ కలసి వ్యవహరించిన మాయావతి చంద్రబాబులకు సాన్నిహిత్యం ఎక్కువగా వుండటం ఒకరికే ఇచ్చిన మర్యాదగాచూపించడం పొరబాటు. నిజానికి పవన్‌ పర్యటన తర్వాత కంగారు పడి చంద్రబాబు బెళ్లారని కూడా చెప్పొచ్చు. దానికే పవన్‌ కుతకుత వుడికిపోవలసింది ఏముంది? అసలు 2014లో పవన్‌కు చంద్రబాబు లోకేశ్‌లే గాక స్వయాన మోడీ కూడా ఎంత మన్నన చేశారో దేశమంతా చూసింది. వారితో పోలిస్తే ఆయన అనుభవం రాజకీయ స్థానం ఏమున్నాయప్పుడు? అప్పుడే అంత ప్రాధాన్యత పొందిన పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు చంద్రబాబుకు మాయావతి మర్యాద ఇస్తే ఉడికిపోయారనే వూహ వచ్చిన వారికి సానుభూతి చూపడం తప్ప చేయగలిగిందేముంటుంది? రాజకీయాలు అవసరాలను బట్టి నడుస్తాయి తప్ప ఆతిధి మర్యాదలను బట్టి కాదని వారు తెలుసుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.