తెలంగాణలో రాజకీయ ప్రకంపనలకు కారణం అవుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును ప్రభుత్వం అసెంబ్లీలో టేబుల్ చేసింది. సభ్యులు అందిరికీ సాఫ్ట్ కాపీలను పంపిణీ చేసింది. ఫ్లోర్ లీడర్లకు పెన్ డ్రైవ్లో నూ ఇచ్చింది. ఆదివారమే ఈ అంశంపై చర్చ జరుగుతుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
సాయంత్రం నాలుగు గంటలకు కాళేశ్వరం పై చర్చ ఉంటుందని మంత్రి ఉత్తమ్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చెప్పారు. ఎంత ఆలస్యం అయినా ఈ రోజు సభలో కాళేశ్వరం పై సంపూర్ణ చర్చ జరుగుతుందని స్పష్టంచేశారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై అందరి అభిప్రాయం తీసుకుంటామని.. ఆ తరువాతనే కమిషన్ రిపోర్ట్ పై ముందుకు వెళ్తామని తెలిపారు. జరిగిన పరిస్థితులపై ఒక రిపోర్ట్ తయారు చేశానని.. సాయంత్రం అసెంబ్లీ లో ఆ రిపోర్ట్ ప్రవేశ పెడుతాననని తెలిపారు. వేల కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉపయోగం లేకుండా పోయిందన్నారు.
ఈ నివేదికను అసెంబ్లీలో పెట్టకుండా ఆపాలని హరీష్ రావు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. అయితే. విచారణకు రాలేదు. ఈ లోపు షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీలో పెట్టేశారు. ఇప్పుడు చర్చ జరగనుంది. బీఆర్ఎస్ నేతలు ఈ చర్చలో పాల్గొంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ వచ్చే అవకాశం లేదని ఇప్పటికే ఆ పార్టీ నేతలు తేల్చేశారు. కేటీఆర్ లేదా హరీష్ రావు మాట్లాడాల్సి ఉంది.