తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ పనైపోయింది..! టీఆర్‌ఎస్‌లో విలీనం..!!

తెలంగాణలో తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసినట్లుగా.. కాంగ్రెస్ పార్టీని పొట్టు పొట్టుగా కొట్టి నిర్వీర్యం చేయాలని… కేసీఆర్ పక్కా ప్లాన్ వేసి ..అమలు చేయడం ప్రారంభించారు. ఆ మేరకు.. కొత్తగా.. ఎమ్మెల్సీలు ఆకుల లలిత,సంతోష్ లను పార్టీలో చేర్చుకుని వారితో పాటు అంతకు ముందే పార్టీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్సీలతో కలిపి… మండలిలో కాంగ్రెస్ పక్షాన్ని టీఆర్ఎస్‌లో విలీనం చేస్తున్నట్లు.. ఛైర్మన్ స్వామిగౌడ్‌కు లేఖ పంపించేశారు. ఈ లేఖను ఆమోదించడం లాంఛనమే. ఆకుల లలిత ఆర్మూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

నిన్నటి వరకు శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీకి ఐదుగురు ఎమ్మెల్సీలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి , టీ సంతోష్ కుమార్ , ఆకుల లలిత , రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేశారు. దాంతో నలుగురయ్యారు. ఇందులో ఇద్దరు ఆకుల లలిత, సంతోష్ కేసీఆర్‌ను కలిశారు. టీఆర్ఎస్‌లో చేరిపోయారు. అంటే.. ఇప్పుడు నికరంగా.. మండలిలో షబ్బీర్ అలీ, పొంగులేటి మాత్రమే సభ్యులుగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. వీరి పదవి కాలం కూడా మార్చి వరకే ఉంది. గతంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన దామోదర్ రెడ్డి, ప్రభాకర్ అనే ఎమ్మెల్సీలు టీఆర్ఎస్‌లో చేరిపోయారు. అంటే… మార్చి తర్వతా ఇక కాంగ్రెస్ పార్టీకి సభ్యులు కూడా ఉండరన్నమాట. టీఆర్ఎస్‌ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీ లు భూపతి రెడ్డి , యాదవ్ రెడ్డి, రాములు నాయక్, కొండా మురళిలను.. టీఆర్ఎస్ అలా సహించే అవకాశం లేదు. బుధవారం తర్వాత వారిపై వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది. వారందరిపై వేటు వేసి.. కొత్త వాళ్లకు ఇచ్చేందుకు కసరత్తు కూడా ప్రారంభించింది.

ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు మార్చిలో ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఉంటే ఒక్క ఎమ్మెల్సీ స్థానం వస్తుంది. కానీ ఎమ్మెల్సీలనే వదిలి పెట్టని కేసీఆర్.. ఎమ్మెల్యేలను ఎలా వదిలి పెడతారు. ఇప్పటికే టీఆర్ఎస్ మైండ్ గేమ్ ప్రారంభించారు. పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఏ క్షణమైనా చేరవచ్చని… చెబుతున్నారు. మంత్రివర్గ విస్తరణ కోసం.. అందుకే ఆపామని…లీకులిస్తున్నారు. ఈ పరిణామాలతో…. కాంగ్రెస్ పార్టీలో ఎంత మంది ఎమ్మెల్యేలు మిగులుతారో… అర్థం కాని పరిస్థితి.. ఆ పార్టీ అగ్రనేతలకు ఉంది. ఎలా చూసినా… కాంగ్రెస్ పార్టీకి మండలిలో ప్రాతినిధ్యం ఉండదు. ఇదే తెలంగాణ ఇచ్చిన పార్టీకి రక్తకన్నీరు తెప్పిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com