ఎడిటర్స్‌ కామెంట్ : తెలంగాణ ప్రజలకు శాపమే..!

” నేను ఎక్కడ ఉంటే అదే సచివాలయం.. ముఖ్యమత్రి అంటే వ్యక్తి కాదు.. వ్యవస్థ..!” .. అంటూ… రెండో సారి గెలిచిన సమయంలో మీడియాతో కేసీఆర్ వ్యాఖ్యానించారు. దీని నేపధ్యం.. కేసీఆర్ అసలు సెక్రటేరియట్‌కు వెళ్లకపోవడం…గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించడం. కేసీఆర్ మాటకే కట్టుబడి ఉన్నారు. ఆయన ఎక్కడ ఉంటే.. అక్కడకే అధికావర్గం పరుగులు పెట్టుకుంటూ పోయి.. కావాల్సిన సంతకాలు తెచ్చుకుంటోంది. ఆయన అది కూడా ఇప్పుడల్లా రావొద్దు.. అంటే వెళ్లాల్సిన పరిస్థితి కూడా లేదు. తెలంగాణలో వైరస్ విజృంభిస్తున్న సమయంలో.. కేసీఆర్… హఠాత్తుగా అదృశ్యమయ్యారు. ఆయన సెక్రటేరియట్‌కు రారు… ప్రగతి భవన్‌లోనూ కనిపించరు. ఇక ఫైనల్‌గా.. ఆయనకు అత్యంత ఇష్టమైన ఫామ్‌హౌస్ మాత్రమే కాబట్టి.. అక్కడే ఉండి ఉంటారని అందరూ అనుకుంటున్నారు. కానీ.. దాదాపుగా నెల రోజులుగా.. ఆయన అందులోనూ ఉన్నరన్నదానికి చిన్న తార్కాణం కూడా కనిపించలేదు.

ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు..! “వెరీజ్ కేసీఆర్”..?

కరోనా మహమ్మారి దేశంపై ఓ రేంజ్‌తో దండెత్తుతోంది. అమెరికా కన్నా తీవ్ర స్థాయిలో ఇండియాలోనే ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. భారతీయ ప్రజల జీవన విధానం… ఎక్కువ జన సాంద్రత… పరిశుభ్రతపై మొదటి నుంచి ఉన్న నిర్లక్ష్యం… కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్లుగా వైరస్ వ్యాప్తికి అనేక కారణాలు ఉన్నాయి. అలా అని ఏ రాష్ట్రంలోని పాలకులు చేతులెత్తేయలేదు. శక్తివంచన లేకుండా ప్రజల కోసం.. పని చేస్తూనే ఉన్నారు. కొంత మంది ముఖ్యమంత్రులు అంత:పురాలకే పరిమితమై పని చేసినా… ఎక్కువ మంది ప్రజల్లో తిరిగి ధైర్యం చెప్పారు. కరోనా కట్టడి చర్యలను పర్యవేక్షించారు. కానీ.. తెలంగాణకు వచ్చే సరికి పరిస్థితి మారిపోయింది. కేసులు పదుల్లో ఉన్నప్పుడు… “కత్తి యుద్ధం” చేసినట్లుగా వైరస్‌ను అంతం చేస్తామన్నట్లుగా మాట్లాడిన కేసీఆర్.. ఇప్పుడు వేలకు వేలు కేసులు రోజుకు నమోదవుతున్నా… పట్టనట్లుగా ఉంటున్నారు. కరోనా మరణాలు లెక్కల్లోకి రానంత ఎక్కువగా ఉన్నాయి. అప్పటి వరకూ బాగున్న వారు.. వెంటనే అస్వస్థతకు గురై మరణిస్తున్నారు. నడి రోడ్డు మీద చనిపోతున్నారు. ఇలాంటి పరిస్థితి భయానకం. ప్రజలకు ధైర్యం కల్పించడానికి.. ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన సందర్భం. అయితే.. కేసీఆర్ అసలు ఆయన బయట కనిపించడమే మానేశారు. దీంతో వెరీజ్ కేసీఆర్ అనే ట్రోలింగ్ హైలెట్ అవుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ తీరు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.

టెస్టింగ్ లేదు.. ట్రేసింగ్ లేదు… ట్రీట్‌మెంటూ లేదు..!

ప్రస్తుతం తెలంగాణ ప్రజలకు కరోనా టెస్టుల్లేవ్. డబ్బులున్నవారు ప్రైవేటు ల్యాబ్స్‌లో చేయించుకుంటారు. కాస్త తక్కువకు టెస్టులు చేసే ల్యాబ్స్‌పై ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ప్రభుత్వ టెస్టింగ్ సెంటర్లలో చాలా చాలా పరిమితంగా టెస్టులు చేస్తారు. హైదరాబాద్‌లో ఉన్న శాంపిల్ సేకరణ కేంద్రాల్లో రోజు టార్గెట్ 250 మాత్రమే పెట్టుకున్నారు. ఆ మేరకు మాత్రమే టోకెన్లు జారీ చేస్తున్నారు. అవి అయిపోతే తర్వాతి రోజు రావాల్సిందే. ఆ తర్వాతి రోజు.. శాంపిల్స్ తీసుకుంటారా లేదా అనే టెన్షన్. టెస్టుల సంగతి పక్కన పెడితే.. రిపోర్ట్ ఎప్పటికి వస్తుందో తెలియదు. పోనీ… చేసే రిపోర్ట్ జీనియన్‌గా ఉంటుందా అంటే అదీ లేదు. పూర్తిగా మాన్యువల్ పద్దతిలో చేత్తో.. శాంపిల్ నెంబర్స్ వేస్తూ… తీసుకుంటున్నారు. చాలా సార్లు.. తీసుకున్న శాంపిళ్లు గల్లంతయిన ఘటనలు జరిగాయి. కనీసం.. ఓ సాఫ్ట్ వేర్ ఉపయోగించుకుని… శాంపిల్స్ ఇస్తున్న వారి వివరాలు అప్ డేట్ చేసుకుంటే… పాజిటివ్ వస్తే.. తక్షణం ట్రాక్ చేసి చికిత్స అందించడానికి అవకాశం ఉంటుందన్న ఆలోచన కూడా చేయడం లేదు. పొరపాటున పాజిటివ్ వస్తే.. ఫోన్ చేసి.. పాజిటివ్ వచ్చింది.. ఫలానా టాబ్లెట్లు వాడండి అని చెబుతున్నారు కానీ.. ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించే పరిస్థితి లేకుండా పోయింది. తెలంగాణ హెల్త్ సెక్రటరీ.. కొద్ది రోజుల క్రితం.. గాంధీ ఆస్పత్రిలో వెయ్యి పడకలు ఖాళీగా ఉన్నాయని … చికిత్సకు ఇబ్బంది లేదని ప్రకటించారు. కానీ ఆ రోజే.. గాంధీ ఆస్పత్రిలో చేర్చుకోవడం లేదంటూ.. ఎంతో మంది వెనక్కి వచ్చారు. తెలంగాణకు తలమానికంగా చేస్తామన్న తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్‌ను ప్రారంభించడం చేత కావడం లేదు. హోం ఐసోలేషన్ అంటూ.. కొత్తపదం కనిపెట్టి ఇంట్లోనే ఉండమంటున్నారు. ఎంత మందికి ఇళ్లల్లో ప్రత్యేకమైన గదులు ఉంటాయో చెప్పలేం. అదే సమయంలో ఇరుగుపొరుగు వారి “ట్రీట్‌మెంట్” వైరస్ సోకిన వారి కుటుంబం మొత్తాన్ని మానసికంగా బలహీనం చేస్తోంది. ఓ వైపు వైరస్ సోకిన ఆందోళన..మరో వైపు చికిత్స పొందలేకపోతున్నామన్న ఆవేదన.. ఇంకో వైపు.. ఇరుగుపొరుగుల ట్రీట్‌మెంట్.. ఇలా.. కరోనా బాధితులు.. పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు.

ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందాలంటే మంత్రుల సిఫార్సు..! ప్రజలకు ఇదేం ఖర్మ..!?

హవ్వ.. ఇది ఎక్కడైనా ఉందా..? అని నోరు నొక్కుకోవాల్సిన విషయం… ఇది. ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరి ట్రీట్‌మెంట్ పొందాలంటే.. ఆరోగ్య మంత్రి లేదా.. ప్రభుత్వంలో పవర్ ఫుల్ అయిన మరో మంత్రి సిఫార్సు ఉండాలి… లేకపోతే… చేర్చుకోరు. హైదరాబాద్‌లో కార్పొరేట్ ఆస్పత్రులు ఇప్పుడు సామాన్యులు ఎవర్నీ చేర్చుకోవడం లేదు. బెడ్స్ ఖాళీ లేవు అనే సమాధానం ఇన్‌స్టంట్‌గా వస్తోంది. దానికి కారణం… వీఐపీల నుంచి డిమాండ్ పెరగడమే. మొన్నటికి మొన్న ఓ జర్నలిస్ట్.. హరీష్ రావుకు.. పంపిన వీడియో వైరల్ అయింది. తాను డబ్బులు పెట్టుకుంటానని.. అపోలో ఆస్పత్రిలో చేర్చుకునేలా చూడాలని.. ఆయన కన్నీరు పెట్టుకున్నారు. అంటే.. చేరడానికే హరీష్ రావు సిఫార్సు కావాల్సి వచ్చింది. ఆ వీడియో వైరల్ అయింది కాబట్టి చేర్చుకున్నారు. అలాంటి వారు ఎంత మంది ఉన్నారో లెక్క లేదు. అలా ఏ మినిస్టర్‌తోనూ సిఫార్సు చేయించుకోలేక …ఏ ఆస్పత్రి చేర్చుకోలేక.. కళాకారుడు సుద్దాల నిస్సార్ ప్రాణాలు కోల్పోయారు. నిస్సార్ లాంచి వాళ్లు కొన్ని వందల మంది ఉన్నారు. అటు ప్రభుత్వ వైద్యం లేదు.. ఇటు ప్రైవేటు వైద్యం ప్రముఖులకు మాత్రమే పరిమితమయింది. సిఫార్సులకే అందుతోంది. ఇక సామాన్య ప్రజలకు ఎవరు దిక్కు..?

“రోమ్ – ఫిడేల్” కన్నా… “కరోనా – కూల్చివేత”లే చరిత్రలో నిలిచిపోయే పరిస్థితి..!

రోమ్ నగరం తగలబడుతూంటే…నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నారని పాలకుడి నిర్లక్ష్యానికి అతి పెద్ద తార్కాణంగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు అది… కరోనాతో ప్రజలు చనిపోతూంటే… సచివాలయం కూల్చివేతలతో టైంపాస్ చేసుకుంటున్నారని.. ప్రభుత్వ తెలంగాణ ప్రభుత్వానికి అన్వయించాల్సిన పరిస్థితి. ఇదేందని ప్రశ్నించిన వారిని మంత్రులు ఎదురుదాడి చేస్తున్న వైనం చూసి.. అందరూ బిత్తర పోవాల్సిన పరిస్థితి. ఒక్కరంటే.. ఒక్కరూ.. కరోనా విషయంలో ప్రజలకు భరోసా ఇవ్వడం లేదు. “పాత భవనంలో సంసారం చేయాలా..? అంటూ తలసాని లాంటి మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు వెగటు పుట్టిస్తున్నాయి. సచివాలయంలో సంసారం చేస్తున్నారా.. అని అవాక్కవ్వాల్సిన పరిస్థితి ప్రజలది. కూల్చివేస్తే తప్పేంటి… తిట్లు లంకించుకుంటున్నారు. ఇప్పటికే పోలీసు పవర్‌తో ప్రతిపక్షాలను అడుగు ముందుకు వేయకుండా చేస్తున్నారు. వారిలోనూ కరోనా భయం వెంటాడుతోంది. ఉద్యమాలు చేసే పరిస్థితి లేదు. దీన్ని కూడా ప్లస్‌పాయింట్‌గా మార్చుకున్న ప్రభుత్వం… అజెండా ప్రకారం వెళ్తోంది.

కేసీఆర్ కనిపించకపోతే నష్టం లేదా..?

కేసీఆర్ ఎక్కడ ఉంటే ఏమిటి..? కనిపించకపోతే నష్టం ఏమిటి..? అభివృద్ధి ఆగిందా..? పథకాలు ఆగాయా..? అంటూ.. మంత్రులు.. వెరీజ్ కేసీఆర్ ఆని ప్రశ్నిస్తున్న వారిపై వితండవాదంతో ఎదురుదాడికి దిగుతున్నారు. ఆ లెక్కన ప్రభుత్వం లేకపోయినా కాలం ఆగదు. ముఖ్యమంత్రి ఉన్నా .. లేకపోయినా ఎవరి పనులు వారు చేసుకుంటారు. అధికారంలో ఏ పార్టీ లేకపోయినా తెలంగాణ ప్రజలు ఎక్కడివారు అక్కడ ఉండిపోరు. కానీ ఓట్లు వేసి గెలిపించారు కాబట్టి.. బాధ్యత అనేది ఒకటి ఉంటుంది. పథకాలు వస్తున్నాయా..? అభివృద్ది ఆగిందా..? అనేది చెప్పుకోవడానికి బాగుంటుంది.. కానీ పోతున్న ప్రాణాలకు బాధ్యులెవరు..?

తెలంగాణ కరోనా ఫ్రీ స్టేట్ అయ్యే మొట్టమొదటి రాష్ట్రమని.. ప్రెస్‌మీట్లలో కేసీఆర్ కత్తి తిప్పినంత పని చేశారు. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు కత్తి.. డాలు వదిలేసి.. వేరే అజెండాను అమలు చేయడం ప్రారంభించారు. ఆ అజెండాలో మనుషుల ప్రాణాలు కాపాడే అంశానికి చోటు లేకుండా పోయింది.. అదే మహా విషాదం…!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close