స్థానిక ఎన్నికలకు కోర్టు ఇచ్చిన గడువు నెలాఖరుతో ముగియనుంది. దీంతో ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలని తాపత్రయ పడుతోంది. అందులో భాగంగా.. ఓ జీవో విడుదల చేసేసి.. వెంటనే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇచ్చేయాలని అనుకుంటోంది. జీవోను ఏ క్షణమైనా విడుదల చేయనున్నారు. బీసీలకు42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ .. ఉత్తర్వులు ఇవ్వనున్నారు. ఈ కారణంగా రిజర్వేషన్లు 67శాతానికి చేరుకుంటాయి. ఈ మేరకు చేసిన చట్టం ఇంకా ఆమోదం పొందలేదు. ఆర్డినెన్స్ కూడా తిరిగిరాలేదు. అయినా జీవో ఇవ్వడం అంటే .. అది కోర్టుల్లో మరో మాట లేకుండా ఆగిపోతుంది.
అందుకే మంత్రి పొన్నం ప్రభాకర్ అందరూ జీవోను స్వాగతించాలని.. గౌరవించాలని ఎవరూ కోర్టుకు వెళ్లవద్దని అంటున్నారు. కానీ మనది ప్రజాస్వామ్యం ఒకరికి నచ్చితే ఇంకొకరికి నచ్చదు. అందుకే కోర్టుకు వెళ్లకుండా ఉండరు. ఎవరో ఒకరు వెళ్తారు. చట్టపరంగా ఆ జీవో విడుదల కాలేదు కాబట్టి సహజంగానే ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగుుతులుతుంది. కానీ కోర్టుకు వెళ్లారని చెప్పి ఇతర పార్టీల మీద రాజకీయం చేయడానికి అవకాశం ఉంటుంది.
ఎన్నికల షెడ్యూల్ కూడా అదే రిజర్వేషన్లను చూపించి సోమవారం కోర్టులు ప్రారంభం కాక ముందే జారీ చేస్తే అసలు స్థానిక ఎన్నికలే సమస్యల్లో చిక్కుకుంటాయి. కోర్టు వివాదాల్లో.. రిజర్వేషన్ల జీవో ఇరుక్కుపోతే ఆ జీవో ప్రకారం ఇచ్చిన నోటిఫికేషన్ కూడా ముందుకు వెళ్లదు. అందుకే.. స్థానిక ఎన్నికలు ఆగిపోతాయి. ఇది మరిన్ని సమస్యలు తెచ్చి పెడుతుంది. జీవో ఇవ్వకుండా రాజకీయపరమైన రిజర్వేషన్లు ఇస్తే బెటరన్న అభిప్రాయం మంత్రులు వినిపించినా.. జీవో వ్యూహానికే రేవంత్ మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు.