హైదరాబాద్ కోకాపేటలో స్వరూపానంద పీఠానికి కేటాయించిన రెండు ఎకరాలను తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కోకాపేటలోని నియోపోలిస్ ఏరియాలో పెరుగుతున్న జనాభా , మౌలిక సదుపాయాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, శారదాపీఠం భూమిని వాటర్ బోర్డు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాంతంలో తాగునీటి సరఫరా కోసం రిజర్వాయర్లు, ఇతర వసతులు నిర్మించాల్సిన అవసరం ఉందని, అందుకే శారదాపీఠానికి గతంలో ఇచ్చిన 2.34 ఎకరాల భూమిని ప్రభుత్వం తిరిగి వెనక్కి తీసుకోవాలని తీర్మానించింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2019లో సర్వే నంబరు 240లోని అత్యంత విలువైన ఈ భూమిని ఎకరానికి కేవలం ఒక్క రూపాయి చొప్పున నామమాత్రపు ధరకు శారదాపీఠానికి కేటాయించారు. అయితే, ప్రజోపయోగ పనుల దృష్ట్యా ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోంది. దీనికి సంబంధించి ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా అధికారికంగా నిర్ణయం తీసుకున్నట్లు రెవెన్యూ శాఖ తెలిపింది.
కోకాపేటలో వెనక్కి తీసుకున్న భూమికి బదులుగా, శంషాబాద్ ప్రాంతంలో శారదాపీఠానికి సమాన విలువ గల ప్రత్యామ్నాయ భూమిని కేటాయించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆధ్యాత్మిక సంస్థలకు ఇచ్చే గౌరవం ఇస్తూనే, ప్రజా ప్రయోజనాల కోసం ఈ మార్పు చేస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. శంషాబాద్‌లోని అనువైన స్థలాన్ని గుర్తించి, పీఠం నిర్వాహకులకు అప్పగించే ప్రక్రియను రెవెన్యూ యంత్రాంగం చేపట్టింది.


