తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలను మూడు నెలల్లోగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సెప్టెంబర్ 30లోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. రిజర్వేషన్ల ఖరారుకు ముఫ్పై రోజులు.. ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియకు అరవై రోజుల సమయం కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరడంతో హైకోర్టు సెప్టెంబర్ 30వ తేదీని గడువుగా ఖరారు చేసింది. ఈ లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.
ప్రభుత్వం కూడా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటోంది. కానీ బీసీ రిజర్వేషన్లు, ఇతర అంశాల్లో లేనిపోని టార్గెట్లు పెట్టుకోవడంతో సమస్య ఏర్పడింది. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో ఎన్నికలు నిర్వహిస్తామని..బీసీలకు రాజకీయంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణలో పంచాయతీ, పరిషత్, మున్సిపల్ అన్నీ ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్నాయి.
వీలైనంత త్వరగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నా… రిజర్వేషన్ల ఖరారుకు నెల రోజులు పడుతుందని కోరడంతో.. నెల రోజుల్లో జరిగే అవకాశాలు లేనట్లే. రిజర్వేషన్లు ఖరారు అయిన వరుసగా స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. అయితే మున్సిపల్ ఎన్నికల విషయంలో మాత్రం ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాల్సి ఉంది.