తెలంగాణ పంచాయతీ ఎన్నికల ఫలితాల రెండో విడత కూడా ముగిసింది. పార్టీల పరంగా జరిగే ఎన్నికలు కాదు కాబట్టి గెలిచిన అభ్యర్థి ఎవరు మద్దతుదారు అన్నది కొంత గందరగోళం ఉంటుంది. గ్రామస్థాయిలో క్లారిటీ ఉంటుంది. ఏ పార్టీకి చెందిన వారు ఆ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసుకుంటారు. ఎలా ప్రచారం చేసుకున్నా.. మెజార్టీ స్థానాలను బట్టి చూస్తే క్లారిటీ వస్తోంది. మరో విడత మిగిలిన ఉన్న తర్వాత.. రెండు విడతల్లో దాదాపుగా తొమ్మిది వేల పంచాయతీలకు పోలింగ్ పూర్తయింది. ఫలితాలు చూసి ఏ ఒక్క పార్టీ నిరాశపడటం లేదు. బీజేపీ కూడా.. గ్రామస్థాయిలో తమకు ఉన్న బలానికి తగ్గట్లుగా ఫలితాలు సాధించింది. అందుకే ఎవరూ ఫీల్ కావడం లేదు. అందరూ హ్యాపీగానే ఉన్నారు. అదే ఓటర్ ప్రత్యేకత అనుకోవాలి.
అధికార పార్టీని ఊపిరి పీల్చుకునేలా చేసిన గ్రామీణ ఓటర్
సర్పంచ్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీకి కొంత మేర టెన్షన్ ఉండేది. ఎరువుల సమస్యల దగ్గర నుంచి చాలా సమస్యలు వారిని పలకరించాయి. అదే సమయంలో బీసీ రిజర్వేషన్ల అంశం కూడా ప్రభావం చూపుతుందని కంగారు పడ్డారు. రెండేళ్ల పాలనా వ్యతిరేకత గ్రామాల్లో చాలా ఎక్కువగా ఉందని ప్రచారం జరిగింది. ఇలాంటి సమయంలో జరిగిన పంచాయతీ ఎన్నికలు ఆ పార్టీకి షాక్ ఇవ్వలేదు. సంతృప్తి పడేలా చేశారు. కనీసం 55 శాతం పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు. ఇతరులు గెలిచిన చోట్ల కాంగ్రెస్ రెబల్సే ఎక్కువ గెలిచారు. ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని కానీ జాగ్రత్త ఆడాల్సిన అవసరాన్ని ఓటర్ కాంగ్రెస్ పార్టీకి గుర్తు చేశాడు.
భారత రాష్ట్ర సమితి ఆశలు నిలిపిన ఓటర్
మరో వైపు భారత రాష్ట్ర సమితికి గతంతో పోలిస్తే నిరాశాజనకమైన ఫలితాలే. కానీ ప్రతిపక్షంలో ఉండి గ్రామీణ స్థాయిలో కొంత మేర పట్టు నిలుపుకోవడం చిన్న విషయం కాదు. పెద్ద ఎత్తున క్యాడర్ వలస పోయినా.. గ్రామ క్యాడర్ ను కాపాడుకుని వారికి ఆర్థిక సాయం చేసి బరిలో నిలబడి ప్రజల మద్దతు పొందేలా చేయడంలో పార్టీ నాయకత్వం కూడా గట్టిగానే ప్రయత్నించింది. దీని వల్ల గ్రామ ప్రాంతాల్లో తమ పట్టు నిరూపించుకున్నామని.. తాము నిర్వీర్యం అయిపోలేదన్న ధైర్యం వారికి వచ్చింది. ఇది ఆ పార్టీ క్యాడర్ ఎవరైనా వేరే పార్టీలోకి వెళ్లాలనుకుంటే.. ఆపే శక్తిని ఇస్తుంది.
బీజేపీ హైప్ కు తగ్గట్లుగా గెలవలేదు..కానీ బెదరే !
బీజేపీ ఎప్పుడైనా పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రమే మెరుగైన ఫలితాలను చూస్తుంది. ఓటర్లు ఓటు వేసే ప్రాధాన్యత.. పంచాయతీ, అసెంబ్లీ, పార్లమెంట్ కు మారిపోతుంది. పంచాయతీకి లోకల్ అధికారం కాబట్టి అదే చూసుకుంటారు. అసెంబ్లీకి వచ్చే సరికి రాష్ట్ర స్థాయిలో ఎవరు కావాలో ఆ వ్యూహంతో వేస్తారు. కానీ పార్లమెంట్ కు వచ్చే సరికి .. ఈ అభిప్రాయం ఇంకా మారిపోతుంది. అందుకే మోదీ కోసం ఎక్కువ మంది పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తున్నారు. కానీ గ్రామ స్థాయి రాజకీయాలకు వచ్చే సరికి స్థానిక నాయకులకే ప్రాధాన్యం. గ్రామ స్థాయిలో బీజేపీకి క్యాడర్ లేదు. క్యాడర్ ఉన్న చోట గెలుస్తున్నారు. బీజేపీ మరీ తీసికట్టుగా ఏమీ పంచాయతీ ఎన్నికల్లో లేదు. కానీ.. ప్రచారం చేసుకున్నంతగా మాత్రం సర్పంచ్ స్థానాలు రాలేదు. ఓ రకంగా ఆ పార్టీ చేసుకున్నదే.
మొత్తంగా పంచాయతీ ఎన్నికలు ఎవరూ సంబరాలు చేసుకునేంత గొప్పగా ఓటర్ చేయలేదు. అందరికీ సంతృప్తిని ఇస్తున్నాడు. అదే ఓటర్ మ్యాజిక్ అనుకోవచ్చు.
