తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ సాదా బైనామా భూముల క్రమబద్ధీకరణ కోసం కీలక నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 9.89 లక్షల మంది రైతులు సమర్పించిన దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి మార్గం సుగమమైంది. సుమారు 11 లక్షల ఎకరాల భూములకు 13-బీ ప్రాసీడింగ్స్ జారీ అయ్యే అవకాశం ఏర్పడింది. ఈ ప్రక్రియ ద్వారా చిన్న , మధ్య రైతులకు భూమి హక్కులు , పట్టాదార్ పాస్బుక్లు పొందే మార్గం సులభమవుతుంది.
సాదా బైనామా భూములు అంటే రిజిస్టర్డ్ డీడ్ లేకుండా సాధారణ ఒప్పందం ద్వారా బదిలీ అయిన వ్యవసాయ భూములు. తెలంగాణలో ఇటువంటి భూములు ఎక్కువగా చిన్న రైతులకు చెందినవి ఉన్నాయి. ఇవి రెవెన్యూ రికార్డుల్లో క్రమబద్ధీకరించకపోతే రుణాలు, సబ్సిడీలు పొందడంలో సమస్యలు తలెత్తుతున్నాయి. అమ్మడం కూడా సమస్య అవుతోంది. 2020 నుండి ఈ కేసులు కోర్టుల్లో ఆగిపోయి ఉన్నాయి. ఇటీవల హైకోర్టు అనుమతి ఇచ్చింది.
ఈ సమస్య పరిష్కారం వల్ల సుమారు 9.74 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మంది రైతులకు టైటిల్ డీడ్స్ అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నోటిఫికేషన్ తెలంగాణలో భూమి రికార్డుల అప్డేట్కు కీలకం. 2025 జనవరిలో వచ్చిన ‘తెలంగాణ భూభారతి యాక్ట్’ , ఏప్రిల్ 14న విడుదలైన రూల్స్ ప్రకారం, భూములకు భూధార్ నంబర్లు కేటాయించడం , డిజిటల్ రికార్డులు తయారు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో భూమి డాక్యుమెంట్ల వెరిఫికేషన్ , లిటిగేషన్ కేసుల పరిష్కారం సవాలుగా ఉన్నాయి. ఈ సాదాబైనామాల సమస్యను పరిష్కరించడంతో అవి కూడా ఆ సమస్యలు కూడా చాలా వరకూ తీరిపోతాయి.