ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందంటే.. ఫక్కున నవ్విన వాళ్లున్నారు. ఆనాడు కేసీఆర్ ఉద్యమాన్ని ఒంటరిగా ప్రారంభిస్తే.. కళ్లెదురుగానే అవహేళన చేసిన వాళ్లున్నారు. రాజకీయం కోసమే తెలంగాణను వాడుకుంటున్నారని తిట్టిన వాళ్లున్నారు. కానీ.. టీఆర్ఎస్ అధినేత మొక్కవోని లక్ష్యంతో… సింగిల్ పాయింట్ ఎజెండాగా ఉద్యమం చేశారు. అనుకున్నది సాధించారు. ఈ క్రమంలో.. అవహేన చేసిన వాళ్లని.. విమర్శించిన వాళ్లనీ అందర్నీ కలుపుకున్నారు. అనుకున్నది సాధించారు.. ఇప్పుడా తెలంగాణకు ఐదేళ్లు..!
ఉద్యమాల చరిత్రలో ప్రత్యేక అధ్యాయం “తెలంగాణ”
దేశంలో ఎన్నో రకాల ఉద్యమాలు నడిచాయి. అందులో తమ కులాలకు రిజర్వేషన్ల దగ్గర నుంచి.. తమ ప్రాంతాలకు రాష్ట్రహోదా ఇవ్వాలనే వరకూ.. ఎన్నో ఉద్యమాలు జరిగాయి. కానీ.. స్వతంత్ర భారతదేశంలో… స్పష్టంగా… సక్సెస్ అయిన ఒకే ఒక్క ఉద్యమం తెలంగాణ ఉద్యమం. పిడికెడు మందితో ప్రారంభించి.. సకలజనులను తనతో కలుపుకుని.. కేసీఆర్ ఈ అనితర సాధ్యమైన ఉద్యమాన్ని నడిపి… అనుకున్నది సాధించారు. లక్ష్య సాధనకు.. తనకు రెండే పార్లమెంట్ సీట్లు ఉన్నాయని.. ఆయన వెనుకడుగు వేయలేదు. రాజకీయ బలం పెద్దగా లేదని… కంగారు పడలేదు. ప్రజాబలమే తన బలంగా మార్చుకుని పోరాడి… నాలుగున్నర కోట్ల మంది ఆశల్ని నెరవేర్చారు.
“బంగారు” దిశగా బుడిబుడి అడుగులు..!
ఐదేళ్లలో తెలంగాణ ఏం సాధించింది..? ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ప్రజల బతుకులు బాగుపడ్డాయా..? ఇవి చాలా మంది మదిలో ఉన్న ప్రశ్న. నిజానికి… ఐదేళ్ల కిందటి నాటి పరిస్థితులతో పోలిస్తే.. ఇప్పుడు… తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. కరెంట్ సమస్య తీరిపోయింది. పల్లెల్లో.. సాగునీరు కళకళలాడుతోంది. సాధ్యమా అనుకునేటటువంటి .. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు.. అత్యంత వేగంగా పూర్తయి… తెలంగాణ ప్రజలకు సాగునీటి కష్టాలు లేకుండా చేయబోతున్నాయి. ప్రతీ దానికి ఆంధ్ర పాలకుల వెంటపడే పరిస్థితి లేకుండా.. తెలంగాణ తలెత్తుకుని బతుకుతోంది. ఈ క్రమంలో… దీర్ఘకాలిక ప్రయోజనాల లక్ష్యంత.. సర్కార్ చేపడుతున్న పనులతో… భవిష్యత్ మరింత బంగారు మయం కానుంది.
మానవతప్పిదాలతో వచ్చే కష్టాలను తగ్గించాలే…!
తెలంగాణ ఏర్పడిన ఐదేళ్లలో… అద్భుతమైన ప్రగతి.. అనితరసాధ్యమైన అభివృద్ధి సాధించినప్పటికీ… కొన్ని కొన్ని మచ్చలైతే పడిపోయాయి. అవన్నీ.. మానవ తప్పిదాలతో వచ్చిన తిప్పలే. ఇంటర్ బోర్డు వైఫల్యాలు కానీ… కొండగట్టు ప్రమాదం కానీ… రెవిన్యూ రికార్డుల ప్రక్షాళనలో అవినీతి కానీ..అన్నీ మానవ తప్పిదాలే. వ్యక్తిగత స్వార్థంతో కొంత మంది చేస్తున్న తప్పుల వల్ల తెలంగాణకు మరకలు అంటుతున్నారు. బంగారు తెలంగాణ సాధనలో ఐదేళ్ల తర్వాత కూడా ఇలాంటి సమస్యలు ఉండటం ఆశ్చర్యకమే. అందుకే తెలంగాణసర్కార్.. అవినీతిపై దృష్టి సారించింది. అన్ని వ్యవస్థను ప్రక్షాళన చేసి.. ఓ ఆదర్శవంతమైన వ్యవస్థను రూపుదిద్దబోతోంది. వచ్చే ఐదేళ్లలో … అంటే.. దశాబ్దాకల్లా.. తెలంగాణ.. సంపదలోనే కాదు… వ్యవస్థలోనూ బంగారు మయం అవుతుందని ఆశిద్దాం..! జై తెలంగాణ..!