Telusu Kada Movie Telugu Review
Telugu360 Rating: 2.25/5
‘తెలుసు కదా’ ఏ జానర్ సినిమా? అని సిద్దు జొన్నలగడ్డను అడిగితే…’ఈ సినిమా వచ్చిన తర్వాత తెలుసు కదా జానర్ అనే కొత్త ట్రెండ్ స్టార్ట్ అవుతుంది” అని చెప్పాడు. పెద్ద స్టేట్మెంట్ ఇది. మరి అంతలా కొత్త ట్రెండ్ సెట్ చేయగల కంటెంట్ ఏమిటి? కొత్త దర్శకురాలు నీరజ కోన రాసుకున్న కథలో బలం ఎంత? ఈ లవ్ ట్రైయాంగిల్ ఆడియన్స్‌కి ఎలాంటి అనుభూతిని ఇచ్చింది?
వరుణ్ (సిద్దు జొన్నల గడ్డ) ఓ అనాధ. ప్రేమించిన అమ్మాయితో పెళ్లి, పిల్లలు, ఒక ఫ్యామిలీ.. ఇది తన కల. కాలేజ్ డేస్ లో రాగ(శ్రీనిధి శెట్టి)ని ఘాడంగా ప్రేమిస్తాడు. రాగ భిన్నమైన ఆలోచనలు వున్న అమ్మాయి. తనకి పెళ్లి పిల్లలు లాంటి రిలేషన్స్ ఇష్టం వుండదు. వరుణ్ కి బ్రేకప్ చెప్పేస్తుంది. ఆ బ్రేకప్ తో వరుణ్ ఆలోచనలు మారిపోతాయి. ఒక రిలేషన్షిప్ లో ఎమోషనల్ కంట్రోల్ తన చేతిలో వుండాలని డిసైడ్ అయిపోతాడు. బ్రేకప్ నుంచి కోలుకుని అంజలి(రాశి ఖన్నా)ని పెళ్లి చేసుకుంటాడు. అయితే అనుకోని ఓ సంఘటన కారణంగా రాగ మళ్ళీ వరుణ్ జీవితంలోకి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? తన మనసు విరిచి బాధ పెట్టిన రాగతో వరుణ్ ఎలాంటి రిలేషన్ కొనసాగించాడు? వరుణ్, రాగ గతం గురించి అంజలికి తెలిసిందా? ఈ ముగ్గురి జర్నీకి ఎలాంటి ముగింపు దొరిందనేది మిగతా కథ.
క్యారెక్టర్ బేస్డ్ సినిమాలకు ఒక సౌలభ్యం ఉంటుంది. క్యారెక్టర్ హిట్ అయితే కథ గురించి పెద్దగా పట్టించుకోరు ఆడియన్స్. సిద్దు కెరీర్లో ఇది గొప్పగా వర్క్ అయ్యింది. సిద్దుకి స్టార్ బాయ్ ఇమేజ్ తీసుకొచ్చింది డిజే టిల్లు.. క్యారెక్టర్ బేస్ సినిమానే. తెలుసు కదా కూడా క్యారెక్టర్ డ్రివెన్ కథ. గ్రే షేడ్ ఉన్న ఒక క్యారెక్టర్‌ను రాసుకుంది నీరజ కోన. అయితే ఈ క్యారెక్టర్ అతని ఫిలాసఫీ కొంత క్లారిటీగా చాలా వరకూ గంధరగోళంగా తికమకగా సాగుతాయి.
వరుణ్ బ్రేకప్ సీన్ తో కథ మొదలౌతుంది. వరుణ్ తీసుకున్న నిర్ణయం అతని క్యారెక్టర్ పై ఆసక్తిని పెంచుతుంది. తను రాడికల్ గా మారుతాడా? అనే అంచనాలు పెరుగుతాయి. కానీ పెళ్లి చూపులు, రాశి ఖాన్నతో పెళ్లి సన్నివేశాలతో ఓ మామూలు కథగానే అనిపిస్తుంది. కథలో ‘సరోగసి’ పాయింట్ వచ్చిన తర్వాత ఓ కొత్త మలుపు తీసుకుంటుంది. అయితే ఈ కథలో సరోగసి పాయింట్ బలవంతంగా ఇరికించినట్లుగా అనిపిస్తుంది. ఒక బ్రేకప్ స్టొరీలో టూ మచ్ సినిమాటిక్ లిబారిటీ ఇది. ముగ్గురుని ఒక్క ఇంట్లోకి చేర్చి వేసిన ఇంటర్వెల్ బ్యాంగ్ మరీ అంత ఎక్సయిటింగ్ గా వుండదు. దీనికి కారణం అసలు ఇలా రియల్ లైఫ్ లో జరిగే అవకాశం ఒక్క శాతమైన ఉందా అనే లాజిక్ ప్రేక్షకుడిని తొలిచేస్తుంటుంది.
సెకండ్ హాఫ్ నుంచి తెలుసు కదాలో అసలు కాన్ఫ్లిక్ట్ తెరపైకి వస్తుంది. ఫస్ట్ లవ్ ని మర్చిపోలేకపోవడం, ప్రేమ పగగా మారడం, వరుణ్ ఫిలాసఫీ.. ఇవన్నీ కూడా కాస్త గంధరగోళంగా వుంటాయి. ఈ పాయింట్లు కనెక్ట్ అయితే మాత్రం వరుణ్ క్యారెక్టర్ పై ఎంపతీ వస్తుంది. కనెక్ట్ కాకపోతే మాత్రం సైకో పాత్, పెర్వెర్ట్ థాట్ అనుకునే ఛాన్స్ కూడా వుంది. నిజానికి ఇలాంటి కథలకు క్లైమాక్స్ అంత తేలిక కాదు. రాగ పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో తీసుకున్న ఓ నిర్ణయానికి, సరోగసీ పాయింట్ కి జస్టిఫికేషన్ చేస్తూ కథ శుభం కార్డు వేశారు కానీ నిజ జీవితంలో రిలేట్ చేసుకోలేని ముగింపు అది.
టిల్లు ఇమేజ్ నుంచి బయటకు రావాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్న సిద్దు, వరుణ్ పాత్రలో ఇమిడిపోవడానికి తన వంతు ఎఫర్ట్ పెట్టాడు. వరుణ్ పాత్ర సిద్దు కెరీర్లో భిన్నమైనదే. ఒక వైల్డ్ ఫిలాసఫీ, గ్రే షేడ్ ఉన్న ఆ పాత్రలో సిద్దు నటన ప్రత్యేకంగా ఉంటుంది. తన టైమింగ్ కొన్ని సన్నివేశాలకు బలాన్ని తీసుకొచ్చింది. శ్రీనిధి బోల్డ్ క్యారెక్టర్ లో కనిపించింది. కొంచెం బ్యాలెన్స్ తప్పినా పూర్తిగా నెగిటివ్ టోన్ లోనే జారిపోయే పాత్ర అది. ఆ పాత్రని సెకండ్ హాఫ్ లో ఇంకాస్త తీర్చిదిద్దాల్సింది. అంజలిగా కనిపించిన రాశి ఖన్నాదీ కూడా బలమైన పాత్రే. విడాకులు కోసం వరుణ్ తో గొడవ పడే సన్నివేశంలో తన నటన ప్రత్యేకంగా వుంటుంది. వైవా హర్ష చాలా సెటిల్డ్ గా కనిపించాడు. సిద్దుతో తన డైలాగ్స్ కొన్ని నవ్విస్తాయి. అన్నపూర్ణమ్మా వీర్యం శౌర్యం అంటూ కాస్త అడల్ట్ కామెడీ చేసింది. మిగతా పాత్రల గురించి చెప్పడానికి ఏమీ లేదు.
టెక్నికల్‌గా సినిమా రిచ్‌గా ఉంది. జ్ఞానశేఖర్ కెమెరా వర్క్ సినిమాకి గ్లాసీ లుక్ తీసుకువచ్చింది. తమన్ ఇచ్చిన మల్లిక గంధ పాట చూడడానికి కూడా బావుంది. నేపథ్య సంగీతం మాత్రం ఈ కథకి అతకలేదు. ప్రొడక్షన్లో పీపుల్ మీడియా క్వాలిటీ కనిపించింది. కాస్ట్యూమ్ వర్క్ కూడా బావుంది. కొన్ని డైలాగ్స్ ఆలోచింప చేసేలా వుంటాయి.
తొలి సినిమాకే ఇలాంటి కాంప్లికేటెడ్ క్యారెక్టర్స్‌తో కథ రాసుకున్న నీరజ కోన ఆ కథను సహజంగా హత్తుకునేలా చెప్పడంలో ఇంకాస్త మెరుగ్గా వర్క్ చేయాల్సింది. ఎలాంటి కథ చెప్పినా అందులో వుండే ఎమోషన్ రిలేటబుల్ గా వుంటే రిజల్ట్ బెటర్ గా ఉంటుంది. డైరెక్టర్ గా నీరజ రొటీన్ కి భిన్నంగా ఒక కథని చెప్పే ప్రయత్నం చేసింది. దీన్ని సాంప్రదానికి విరుద్ధంగా సాగే ఒక ప్రయోగాత్మక సినిమా అనే చెప్పాలి. ఒకవేళ ఈ సినిమా బాక్సాఫీసు వద్ద నిలబడితే… ఇలాంటి ఆలోచనలని ప్రేక్షకులు ఇష్టపడుతున్నారని నిర్ధారించుకోవచ్చు.
Telugu360 Rating: 2.25/5