ఓ సినిమా హిట్టయితే.. నిర్మాత తన టీమ్ కి బహుమతులు ఇవ్వడం తరచూ చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా హీరో, దర్శకుడికి గిఫ్టులు ఇచ్చి వాళ్లని మరింత ఖుష్ చేస్తుంటారు. ఇప్పుడు నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ కూడా అదే చేశారు. ‘మిరాయ్’తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఓ మంచి హిట్ వచ్చింది. పీపుల్ మీడియాకు ఈ విజయం కొండంత భరోసా అందించింది. ఈ సినిమా రూ.100 కోట్ల మార్క్ కి చేరువైంది. ఈ ఆనందంలో.. నిర్మాత విశ్వ ప్రసాద్.. తన హీరో తేజా సజ్జా, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనిలకు కార్లు గిఫ్టుగా ఇస్తానని ప్రకటించారు.
దర్శకుడి మాటేమో గానీ, తేజకు ఎంతిచ్చినా తక్కువే. ఎందుకంటే ఈ సినిమా కోసం అంత కష్టపడ్డాడు తేజ.. ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు. సినిమా ప్రమోషన్లలో భాగంగా పాన్ ఇండియా మొత్తం తిరిగాడు. ఇప్పటికీ.. ప్రమోషన్స్ వదల్లేదు. నిన్న హైదరాబాద్ లో సక్సెస్ మీట్ అయిన వెంటనే, ముంబై వెళ్లిపోయాడు. అక్కడ ఈ రోజు సినిమాని ప్రమోట్ చేయబోతున్నాడు.
‘హనుమాన్’ అంతటి పెద్ద హిట్ సాధించిన తరవాత కూడా ఏ సినిమా ఒప్పుకోకుండా మిరాయ్ కే కమిట్ అయ్యాడు తేజా. ఈ సినిమా కోసం తాను అందుకొన్న పారితోషికం కూడా చాలా తక్కువ. హనుమాన్ హిట్ చూపించి నిర్మాత దగ్గర పారితోషికం గుంజడానికి ప్రయత్నించలేదు. హనుమాన్ కంటే ముందు ఒప్పుకొన్న కథ కాబట్టి.. అప్పటి కమిట్మెంట్స్ కే లోబడి పని చేశాడు. సినిమా పూర్తయినా.. ప్రమోషన్లలో పట్టు వదల్లేదు. ఈవారం అంతా ప్రమోట్ చేయడానికే డిసైడ్ అయ్యాడు. తేజ సంపాదించుకొన్న నమ్మకం.. తను చేస్తున్న ప్రమోషన్లు ఈ సినిమాకి బాగా హెల్ప్ అయ్యాయి. కాబట్టి తేజకు ఎంతిచ్చినా తక్కువే అనిపిస్తుంది.