రెండు తెలుగు రాష్ట్రాలూ… ఓజీ ఫీవర్ తో అల్లాడిపోతున్నాయి. ఎక్కడ చూసినా ఓజీ గురించే టాపిక్. తొలి రోజు రికార్డు వసూళ్లు సృష్టించడం ఖాయం. ఆ నెంబర్ ఎంత అన్నది ఈ రోజు సాయింత్రానికల్లా తేలిపోతుంది. పవన్ ఫ్యాన్స్ ఈ సినిమాతో ఫుల్ జోష్ లోకి వచ్చేశారు. తమ హీరోని ఇంత గొప్పగా చూపించినందుకు సుజిత్ ని కొనియాడుతున్నారు. తమన్ కి అయితే ఏకంగా పాలాభిషేకాలే. ఈ సినిమాకు సంబంధించి రియల్ హీరో ఎవరైనా ఉన్నారంటే అది కచ్చితంగా తమన్. తన ఎలివేషన్లు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాని బాగా పుష్ చేశాడు. ‘ఓజీ తరవాత తమిళ సంగీత దర్శకుల గురించి మాట్లాడడం మానేస్తారు.. ఆ లెవిల్ లో ఓజీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉంటుంది’ అని తమన్ ముందే చెప్పాడు. అదే ఇప్పుడు నిజం అయ్యింది.
నిజానికి ‘అఖండ’ లాంటి చిత్రాలకు తమన్ అదిరిపోయే స్కోర్ ఇచ్చాడు. కానీ అక్కడంతా మాస్. ఓజీకి అలా కాదు… క్లాస్‌కి సైతం పూనకాలు వచ్చేలా తమన్ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. తమన్ స్కోర్ లో ఓ స్టైల్ కనిపించింది. ముఖ్యంగా సినిమా ప్రారంభమైన నుంచి 30 నిమిషాల వరకూ తమన్ కొత్త రకమైన సౌండింగ్ అందించే ప్రయత్నం చేశాడు. చాలా చోట్ల ఓజీ ట్రాక్స్ వాడాడు. దాదాపు ప్రతీ ఎలివేషన్లోనూ హంగ్రి చిరుత ట్రాక్ వినిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఒక్కోసారి ఒక్కో సౌండింగ్ తో. అప్పటికే ఆ ట్రాక్ అభిమానుల నరనరాల్లోనూ జీర్ణించుకుపోయింది కాబట్టి.. ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టదు కాబట్టి.. ప్రతీసారీ కొత్తగానే అనిపిస్తుంది. తమ్ముడులో పాట రీ క్రియేట్ చేయడం, జానీ బీట్ వాడడం ఇవన్నీ ఫ్యాన్స్‌కి బాగా నచ్చే విషయాలు.
పవన్ సినిమాలకు ఇది వరకు కూడా వర్క్ చేశాడు తమన్. భీమ్లా నాయక్, వకీల్ సాబ్, బ్రో చిత్రాలకు మ్యూజిక్ అందించాడు. అక్కడ కూడా తమన్ బాగానే కష్టపడినా.. ఈ సినిమాకు మాత్రం ప్రాణం పెట్టేశాడు అనిపించింది. తన బెస్ట్ వర్క్ కూడా ఇదే అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లెద్దేమో.