ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ రెడ్డి ప్రభుత్వం, తెలంగాణలో కేసీఆర్ సర్కార్ సినిమా వాళ్లని అస్సలు పట్టించుకోలేదు. అవార్డుల ప్రదానం అనే విషయాన్నే మర్చిపోయాయి. రెండు చోట్లా ప్రభుత్వాలు మారాయి. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు వచ్చాక గద్దర్ అవార్డుల్ని స్థాపించి, ఓ దఫా అవార్డులు ఇచ్చేశారు. ఇప్పుడు 2025 సంవత్సరానికి అవార్డుల్ని ప్రకటించారు. 2025లో గద్దర్ అవార్డులు ఇచ్చినప్పుడే.. ఏపీలో ఎప్పుడు ఇస్తారు? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. తెలంగాణ ప్రభుత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని, ఏపీలో కూడా నంది అవార్డుల్ని ప్రకటిస్తారు అనుకొన్నారు. కానీ ఏడాది గడిచింది. 2025 గద్దర్ అవార్డులూ ప్రకటించేశారు. కానీ ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి ముందడుగూ వేయలేకపోయింది. గతేడాది నుంచి ‘నంది అవార్డులు ఎప్పుడు’ అని ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరింత ఎక్కువైంది. సినీ ప్రముఖులు, సీనియర్ నిర్మాతలు, దర్శకులు కూడా ‘ఏపీ ప్రభుత్వం ఎప్పుడు అవార్డులు ఇస్తుంది’ అంటూ గళం విప్పుతూనే ఉన్నారు. తాజాగా ఆర్.నారాయణమూర్తి కూడా త్వరలో ఏపీ ప్రభుత్వం కూడా నంది అవార్డుల్ని ప్రకటించాలని, పరిశ్రమని ప్రోత్సహించాలని కోరారు.
తమ్మారెడ్డి భరద్వాజా కూడా ఇదే అంశంపై మాట్లాడారు. ‘ప్రభుత్వం తలచుకొంటే అవార్డులు ఎగ్గొట్టడానికి చాలా కారణాలు చెప్పొచ్చు. ఇవ్వాలనుకొంటే తెలంగాణ ప్రభుత్వంలా 45 రోజుల్లో అవార్డులు ఇచ్చేయొచ్చు’ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం అవార్డుల విషయంలో చిత్తశుద్దితోనే వ్యవహరిస్తోంది. అవార్డుల కోసం నోటిఫికేషన్ ఇవ్వడం, జ్యూరీ ని ఎంపిక చేయడం, వాళ్లు విజేతల్ని ప్రకటించడం ఇవన్నీ కేవలం 45 రోజుల వ్యవధిలోనే జరిగిపోయాయి. ఈ నెలలోనే అవార్డుల్ని కూడా అందిస్తారు. ఈ వేగమే ఏపీ ప్రభుత్వం నుంచి కూడా చిత్రసీమ కోరుకొంటోంది. ఏపీలో కూడా చాలా ఏళ్లుగా నంది అవార్డుల్ని ఇవ్వడం లేదు. ప్రకటించి కూడా అవార్డు ఇవ్వలేదు. అవన్నీ క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. పాత అవార్డుల్ని పక్కన పెట్టినా, కనీసం ఈ యేడాది నుంచైనా అవార్డుల్ని ప్రకటిస్తే బాగుంటుంది.


