ఒకప్పుడు ఇండస్ట్రీకి పెద్ద ఎవరంటే దాసరి నారాయణ రావు గుర్తొచ్చేవారు. పరిశ్రమలో ఎవరికి ఎలాంటి సహాయం కావాల్సివచ్చినా ఆయన ఇంటి తలుపు తట్టేవారు. ఆయన ఇంట్లోనే ఇండస్ట్రీ పంచాయితీలన్నీ జరిగేవి. ఆయన తదనంతరం ఆ కుర్చీ ఖాళీ అయ్యింది. కాకపోతే ఆ బాధ్యతను చిరంజీవి తీసుకొన్నారు. చాలా వ్యవహారాల్ని ఆయన సైలెంట్ గా సెటిల్ చేశారు. ప్రభుత్వ పెద్దల్ని, ముఖ్యమంత్రుల్నికలిసే సందర్భంలోనూ ఇండస్ట్రీ తరపున మెగాస్టార్ హాజరయ్యేవారు. ఆయన ఇంట్లోనూ కొన్ని పంచాయితీలు నడిచాయి. కరోనా సమయంలో కార్మికుల్ని తన వంతుగా ఆదుకొన్నారు. ఇండస్ట్రీని సంఘటిత పరచి, వేలాదిమందికి నిత్యావసరాలు అందించారు. అయితే.. తమ్మారెడ్డి భరద్వాజా లాంటి పెద్దలు మాత్రం ఇవన్నీ గుర్తిండం లేదు. ఆయన ఇప్పటికీ `ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేరు` అనే అంటుంటారు. ఆమధ్య దాసరి తరవాత ఆ కుర్చీ ఖాళీ అయ్యిందని, ఆ స్థానం ఎవరికీ ఇవ్వలేమంటూ పరోక్షంగా చిరంజీవిని ఉద్దేశించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో తమ్మారెడ్డిపై సోషల్ మీడియాలో చిరంజీవి అభిమానులు ఫైర్ అయ్యారు. మెగాస్టార్ అన్ని మంచి పనులు చేస్తుంటే అవేం కనిపించవా? అని ప్రశ్నించారు.
ఇప్పుడు మళ్లీ ఆ చర్చ మొదలైంది. ఈరోజు తమ్మారెడ్డి భరద్వాజా ఓ సినిమా వేడుకలో కనిపించారు. ఈ సందర్బంగా ఇండస్ట్రీ పెద్ద అనే టాపిక్ మళ్లీ వచ్చింది. దానిపై తమ్మారెడ్డి ఎప్పటిలానే స్పందించారు. దాసరి తరవాత కుర్చీ ఖాళీ అయ్యిందని, ఇండస్ట్రీకి దాసరి ఒక్కరే పెద్ద దిక్కని, ఆయన తరవాత ఎవరూ లేరని మరోసారి కుండ బద్దలు కొట్టేశారు. పెద్ద దిక్కు అనేది పదవేం కాదని, అది ఓ బాధ్యత అని చెప్పుకొచ్చారు తమ్మారెడ్డి. దాంతో మరోసారి చిరు ఫ్యాన్స్ అలెర్ట్ అయ్యారు. తమ్మారెడ్డికి ముందు నుంచీ మెగాస్టార్ అంటే పడదని, అందుకే ఆయన పెద్దరికాన్ని ఒప్పుకోలేకపోతున్నారని ఎద్దేవా చేస్తున్నారు. తమ్మారెడ్డి ఒప్పుకొన్నా, ఒప్పుకోకపోయినా.. చిరు ఇంగస్ట్రీ పెద్దనే. ఎందుకంటే చాలా విషయాల్లో ఆయన ముందుండి నడిపించారు.. నడిపిస్తున్నారు కూడా. ‘ఇండస్ట్రీలో ఒకడిగా, ఇండస్ట్రీ బిడ్డగా ఉంటా.. పెద్దగా కాదు’ అని మెగాస్టార్ కూడా కొన్ని సందర్భాల్లో చెప్పారు. కానీ ఫ్యాన్స్కి మాత్రం ఆయనే పెద్ద. ఆయనే బాస్.


