వారియ‌ర్ ట్రైల‌ర్‌: ఇది పోలీసోడి.. మాస్ ఆప‌రేష‌న్‌!

రామ్ తొలిసారి పోలీస్ అవ‌తారం ఎత్తిన సినిమా.. `వారియ‌ర్‌`. లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈచిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఓకేసారి విడుద‌ల అవుతోంది. కృతిశెట్టి క‌థానాయిక‌. ఈరోజు ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. లింగుస్వామి అంటేనే.. మాస్‌, క‌మ‌ర్షియ‌ల్ ఫార్ములా. రామ్ అలాంటి క‌థ‌ల‌కు స‌రిగ్గా స‌రిపోతాడు. `వారియ‌ర్‌` లాంటి సినిమానే అని.. ట్రైల‌ర్ లో క్లియ‌ర్ క‌ట్ గా అర్థ‌మైపోతోంది.

”ఒక చెట్టు మీద‌ న‌ల‌భై పావురాలు ఉన్నాయి. వాటిలో ఒక్క పావురాన్ని కాలిస్తే ఎన్నుంటాయి..” అనే రామ్ డైలాగ్ తో ట్రైల‌ర్ మొద‌లైంది. అక్క‌డ్నుంచి అంతా మాస్ యాక్ష‌న్ హంగామానే.

”క‌ర్నూలు న‌గ‌రానికి డి.ఎస్‌.పిగా వ‌చ్చిన రామ్‌.. ”ఒంటిమీద యూనిఫామ్ లేక‌పోయినా రౌండోక్లాక్ డ్యూటీలోనే ఉంటాను..” అంటూ తానెంత డ్యూటీ మైండెడో చెప్పేశాడు.

మార్నింగ్ వార్నింగ్ ఇచ్చి, ఈవెనింగ్ అరెస్ట్ చేసిన ప‌ర్‌ఫెక్ట్ పోలీస్ ఆఫీస‌ర్‌ని చూశారా ఎప్పుడైనా.. అంటూ ఆర్జేగా… కృతి శెట్టి ఎంట్రీ ఇచ్చింది.

ఆ త‌ర‌వాత గురు పాత్ర‌లో.. విల‌న్ గా ఆది పినిశెట్టి ఎంట‌ర్ అయ్యాడు. ”మ‌నిష‌న్నోడు ఒక‌టి బ‌లంతో బ‌త‌కాలా.. లేదంటో భ‌యంతో బ‌త‌కాల‌” అంటూ త‌న విల‌నిజాన్నిచూపించాడు. క‌ర్నూలు సిటీని త‌న గుప్పెట్లో ఉంచుకొన్న గురుని.. ఆ సిటీకి డీఎస్‌పీ గా వ‌చ్చిన రామ్‌.. ఎలా ఎదుర్కొన్నాడ‌న్న‌దే అస‌లు క‌థ‌. ఈ ఫార్మెట్లో చాలా సినిమాలే వ‌చ్చినా… రామ్ ఎన‌ర్జీ… ఆది విల‌నిజం, లింగుస్వామి మాస్ ఎలివేష‌న్లు… ఇవ‌న్నీ ఈ సినిమాని వేరే లెవ‌ల్ కి తీసుకెళ్తాయ‌న్న భ‌రోసా క‌లిగిస్తున్నాయి. వీళ్లంద‌రికీ తోడుగా డీఎస్‌పీ ఉండ‌నే ఉన్నాడు. మొత్తానికి ఓ మాస్ వంట‌కం రెడీ అయిపోయింద‌న్న విష‌యం అర్థ‌మ‌వుతోంది. మ‌రి బాక్సాఫీసు ద‌గ్గ‌ర వారియ‌ర్ ఎలాంటి ప్ర‌భావాన్నిచూపిస్తాడో తేలాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.