తానాలో ఇటీవల జరిగిన సంఘటనల నేపథ్యంలో ఎన్నడూ లేని విధంగా ఫౌండేషన్ చైర్మన్, ఫౌండేషన్ కోశాధికారి లను ఫౌండేషన్ సభ్యులు అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు . జూన్ 30 గురువారం సాయంత్రం 8 గంటలకు జరిగిన తానా ఫౌండేషన్ ప్రత్యేక సమావేశం లో ప్రస్తుత ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ, ఫౌండేషన్ ట్రెజరర్ శ్రీకాంత్ పోలవరపు మీద అవిశ్వాసం తీర్మానం ఏకగ్రీవం అయ్యింది. ఇదే సమావేశంలో తమ తదుపరి చైర్మన్ గా శశికాంత్ వల్లేపల్లి ని ఫౌండేషన్ సభ్యులు ఎన్నుకున్నారు. విద్యాధర్ గారపాటిని ఫౌండేషన్ సెక్రటరీగా, వినయ్ మద్దినేని ఫౌండేషన్ ట్రెజరర్ గా ఎన్నికయ్యారు.
సంస్థలో కొత్తగా చేరిన సభ్యులకి ఓటింగ్ హక్కు నిర్మూలించడం పై జరిగిన ఓటింగ్ నేపధ్యంలోనే ఈ మార్పులు జరిగినట్టు తెలుస్తోంది. ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులు బోర్డు లో కూడా భాగం కాబట్టి ఈ ఎన్నిక బోర్డు లో సమీకరణ ల పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. కార్యవర్గ ఉద్వాసన పై ప్రతిపాదన చర్చ కి రాగానే కొంత సేపటికి సమావేశం లో నుంచి ఒక వర్గం ఆగ్రహంగా నిష్క్రమించటం తో ప్రస్తుత కార్యవర్గ తొలగింపుతో పాటుగా నూతన కార్యవర్గ ఏకగ్రీవ ఎన్నికకు మార్గం సులభం అయ్యింది. తొలగింపుకు గురైన వెంకట రమణ యార్లగడ్డ, శ్రీకాంత్ పోలవరపు తమకు జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. తానా సంస్థ కి సంక్షోభాలు కొత్త కాకపోయినా, ఇలాంటి అసాధారణ ఎన్నిక తానా చరిత్ర లో తొలి సారి జరిగింది. ఈ వ్యవహారం తానా రాజ్యాంగానికి ఓ కొత్త పరీక్షగా మిగిలిపోనుంది .