కోకాపేట నియోపొలిస్లోని ప్రీమియం ల్యాండ్స్ మూడో విడత ఈ-వేలంలో రికార్డులు నమోదు కాలేదు. కానీ భారీ స్పందన కనిపించింది. ఈ వేలంలో రెండు ప్లాట్లకు ఎకరానికి రూ.118 నుంచి 131 కోట్ల వరకు ధరలు పలికాయి. మొత్తం 8.04 ఎకరాలకు రూ.1,000 కోట్ల మేర ఆదాయం సమకూరింది. మొత్తం మూడు విడతల్లో ఆరు ప్లాట్లలోని 27 ఎకరాలకు రూ.3,708 కోట్లు హెచ్ఎండీఏకు లభించాయి. నాలుగో విడత వేలం ఐదో తేదీన జరగనుంది.
ప్లాట్ నెంబర్ 19లో 8.04 ఎకరాలకు ఎకరానికి రూ.131 కోట్లు పెట్టి కొన్నారు. ప్లాట్ నెంబర్ 20లో మిగిలిన భాగానికి ఎకరానికి రూ.118 కోట్లు పలికింది. కోకాపేటలో హెచ్ఎండీఏ మొత్తం 44 ఎకరాల భూమిని నాలుగు విడతల్లో వేలం వేస్తోంది. ఇక్కడ వేలం ద్వారా వచ్చిన నిధులను హైదరాబాద్ చుట్టూ భూమి అభివృద్ధి, రోడ్లు, పార్కులు వంటి ప్రాజెక్టులకు వినియోగిస్తారు. మిగిలిన 17 ఎకరాలకు నాలుగో విడత వేలం శనివారం జరగనుంది.
గత వేలంలో ఒక ఎకరం భూమికి రికార్డు ధరగా రూ.137.25 కోట్లు పలికింది. ఈ సారి అంత ధర రాలేదు. ఎకరానికి రూ.118 కోట్లకూ కొనుగోలు చేయగలిగారు. 2023లో కోకాపేట్లో ఒక ఎకరం భూమి రూ.100.75 కోట్లకు అమ్ముడైంది. కోకాపేట్ నియోపొలీస్ ప్లాట్లకు రూ.99 కోట్లు కనీస ధర నిర్ణయించారు. దానితో పోలిస్తే దాదాపుగా ఇరవై కోట్ల రూపాయల అదనపు ధర లభించింది.