ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అతి పెద్ద సభను నిర్వహించేందుకు సిద్ధమయింది. ఒంగోలు మహానాడు నుంచి ఆ పార్టీలో జోష్ పెరగ్గా ఈ సారి ఎన్నికలకు ముందు రాజమండ్రిలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించుకుంది. టీడీపీ పొలిట్ బ్యూరో హైదరాబాద్‌లో సమావేశం అయింది. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్టీఆర్ శతజయంతి సందర్బంగా 100 సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. మహానాడు మే లో రెండు రోజుల పాటు రాజమండ్రిలో నిర్వహించాలని పోలిట్ బ్యూరోలో నిర్ణయించింది. ఏప్రిల్ ఆఖరి వరకూ ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
పార్టీ సభ్యత్వంలో జీవితకాల మెంబర్‌షిప్‌ను చేర్చాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు 5 వేల రూపాయలు రుసుముగా పోలిట్ బ్యూరో నిర్ణయించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటుకు డబ్బులు ఇచ్చినా కూడా ఓటర్లు ప్రభావితం కాలేదని పోలిట్ బ్యూరో భావంచింది. అధినేత నుంచి కార్యకర్త వరకూ ఇక క్షేత్రస్థాయిలో పనిచేసే విధంగా పోలిట్ బ్యూరోలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నారు. ఈసారి ఎన్నికల మ్యానిఫెస్టోని భిన్నంగా రూపొందించేందుకు కసరత్తు చేస్తోంది. అలాగే ఆర్ధిక తారతమ్యం లేకుండా ఆదాయాన్ని అందరికీ పంచే విధంగా ప్రత్యేక స్కీములు అమలు చేయనున్నరాు.
నవంబర్‌లో ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని పోలిట్ బ్యూరో భావించింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సంసిద్దంగా ఉండాలని పార్టీ క్యాడర్, లీడర్‌లకు దిశానిర్దేశం చేసింది. పార్టీ ఆవిర్బావ దినోత్సవం అయిన మార్చి 29న హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బహిరంగసభ నిర్వహిస్తున్నారు. చంద్రబాబునాయుడు ఈ సభకు హాజరవుతున్నారు.