‘తూటా’ ట్రైల‌ర్‌: కొంచెం ప్రేమ‌.. కొంచెం యాక్ష‌న్‌

గౌత‌మ్ వాసుదేవ మీన‌న్ బ‌లాల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ల‌వ్ స్టోరీల‌ను అద్భుతంగా తెర‌కెక్కించే మ‌రో మ‌ణిర‌త్నం. అలాగ‌ని కేవ‌లం వాటికే ప‌రిమితం అవ్వ‌లేదు. పోలీస్ క‌థ‌ల్ని బాగా చూపించ‌గ‌ల‌డు. యాక్ష‌న్ డ్రామాల్ని పండించ‌గ‌ల‌డు. ఈసారి వీట‌న్నింటినీ మిక్స్ చేసి ఓ క‌థ రాసుకున్నాడు. అదే `తూటా`. ధ‌నుష్‌, మేఘా ఆకాష్ జంట‌గా న‌టించిన సినిమా ఇది. ట్రైల‌ర్ విడుద‌లైంది.

చ‌క్క‌టి క‌విత్వం, అంత‌కంటే చిక్క‌టి రొమాన్స్‌తో ‘తూటా’ ట్రైల‌ర్‌ని ఓ ప్రేమ కావ్యంలా మొద‌లెట్టాడు గౌత‌మ్ మీన‌న్‌. ఆ షాట్స్ చూస్తుంటే, వెనుక నుంచి వ‌స్తున్న వాయిస్ ఓవ‌ర్ వింటుంటే – గౌత‌మ్ మీన‌న్ మ‌ళ్లీ ఓ ప్రేమ‌క‌థ‌ని ఎంచుకున్నాడేమో అనిపించింది. ఏం మాయ చేశావె లాంటి సినిమాలు క‌ళ్ల ముందు మెదిలాయి. ట్రైల‌ర్‌లో రెండో స‌గం మాత్రం పూర్తిగా యాక్ష‌న్‌, ఫైట్స్‌తో నింపేశాడు. ఓ ప్రేమ‌క‌థ‌లో.. రివైంజ్ ఎంట్రీ అయితే ఎలా ఉంటుంద‌న్న‌ది ఈ సినిమా కాన్సెప్ట్ కావొచ్చు. ఓ స్వ‌చ్ఛ‌మైన ప్రేమికుడు ప‌రిస్థితుల ప్ర‌భావం వ‌ల్ల గ‌న్ ప‌ట్టుకోవాల్సివ‌స్తుంది. అంటే ఈ ల‌వ్ స్టోరీలో గ్యాంగ్ స్ట‌ర్ క‌థ‌కు సంబంధించిన లక్షణాలూ ఉన్నాయ‌న్న‌మాట‌. గౌత‌మ్ మీన‌న్‌కి ప్రేమ‌క‌థ‌లు, యాక్ష‌న్ క‌థ‌లు రెండూ తీయ‌డం వ‌చ్చు. అయితే ప్ర‌తీసారీ ఏదో ఒక‌దాన్నే ఎంచుకునేవాడు. అయితే ఈసారి.. రెండూ మిక్స్ అయ్యాయి. ఈనెల 29న ఈ చిత్రం విడుద‌లవుతోంది. మ‌రి గౌత‌మ్ మీన‌న్ మ్యాజిక్ ఏ మేర‌కు రీ క్రియుట్ అవుతుందో చూడాలంటే అప్ప‌టి వ‌రకూ ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.