సినిమాకి ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ప్రాణం. ఆ రెండూ బావుంటే ప్రేక్షకుడు సంతృప్తితో బయటికి వస్తాడు. ఇప్పుడు 2025 టాలీవుడ్ క్యాలెండర్ ప్రీక్లైమాక్స్ కి చేరుకుంది. నవంబర్ లో మంచి నెంబర్స్ స్కోర్ చేసే సినిమాలు కనిపిస్తున్నాయి.
నవంబర్ కి సరైన ఆరంభం దొరకలేదు. రవితేజ మాస్ జాతర ఈరోజే (నవంబరు 1న) వచ్చింది. కానీ టెక్నికల్ గా నిన్ననే ప్రిమియర్స్ పడిపోయాయి. టాక్ బాలేదు. పరమ రొటీన్ కోవలోకి చేరింది. నిజానికి ఈ సినిమాకు ముందు న నుంచే సరైన బజ్ లేదు. దీంతో పాటు ఇప్పుడు టాక్ వీక్ అయ్యింది. రవితేజ ఖాతాలో మరో నిరాశజనకమైన సినిమా ఇది.
నవంబర్ 7 దాదాపు ఐదు సినిమాలు వున్నాయి. రష్మిక మందన ది గర్ల్ ఫ్రెండ్ సినిమాపై మంచి అంచనాలు వున్నాయి. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గీత ఆర్ట్స్ బ్రాండ్ పై వస్తోంది. ప్యూర్ లవ్ స్టోరీ ఇది. రష్మిక ఫుల్ జోష్ లో వుంది. కాకపొతే ఆమెకు ఇదే తొలి సోలో సినిమా. దీన్ని రష్మిక సినిమానే ప్రమోట్ చేస్తున్నారు. హిట్ కొడితే మాత్రం ఆమె క్రేజ్ డబుల్ అవుతుంది.
సుధీర్ బాబు జటాధరతో వస్తున్నాడు. సోనాక్షి సిన్హా ఇందులో కీలక పాత్ర. పాన్ ఇండియా సినిమా ఇది. తెలుగు హిందీలో ఒకేసారి రిలీజ్. సుధీర్ బాబుకి చాలా కాలంగా కలిసిరావడం లేదు. జటాధర కంటెంట్ ప్రామిసింగ్ గా వుంది. ట్రైలర్ లో హిట్ వైబ్ కనిపించింది. పాజిటివ్ అంచనాలే వున్నాయి.
విష్ణు విశాల్ ఆర్యన్ తో వస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా తమిళ్ లో రిలీజై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. తెలుగు ఆడియన్స్ రియాక్షన్ ఎలా వుంటుందో చూడాలి. తిరువీర్ నటించిన గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోతో పాటు ప్రేమిస్తున్నా అనే మరో సినిమా వస్తోంది. ఈ రెండు సినిమాలపై కూడా అంత బజ్ లేదు.
రెండో వారంలో దుల్కర్ సల్మాన్ కాంత, చాందిని చౌదరి సంతాన ప్రాప్తిరస్తు సినిమాలు వస్తున్నాయి. ఇందులో కాంత బజ్ వున్న సినిమా. ప్రమోషనల్ కంటెంట్ ఆసక్తిని పెంచింది. పైగా లక్కీ భాస్కర్ తర్వాత దుల్కర్ నుంచి వస్తున్న తెలుగు సినిమా, భాగ్యశ్రీ హీరోయిన్ కావడంతో అందరి దృష్టిని ఆకర్షించింది.
మూడో వారంలో అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీ వస్తోంది. ఇదొక థ్రిల్లర్. పోలిమేర సినిమాకి పని చేసిన అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాకి షో రన్నర్ కావడంతో కంటెంట్ పై కొంత నమ్మకం. అయితే ఈ సినిమాకి ఇంకా సరైన ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు. వీలైనంత బజ్ క్రియేట్ చేస్తే సినిమా జనాల్లోకి వెళ్ళే ఛాన్స్ వుంది.
వేణు ఊడుగుల నిర్మించిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. ఖమ్మం… వరంగల్ మధ్య జరిగిన ఒక వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిందించారు. ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్‌తో కలిసి వంశీ నందిపాటి, బన్నీ వాస్ రిలీజ్ చేస్తున్నారు. ఈ కాంబినేషన్ లో వచ్చిన లిటిల్ హార్ట్స్ మంచి హిట్ కొట్టింది. మళ్ళీ ఈ కాంబో రాజు వెడ్స్ రాంబాయి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఓ అదనపు ఆకర్షణ.
నవంబర్ చివరి వారంలో ఆంధ్ర కింగ్ తాలుకా తో వస్తున్నాడు రామ్ పోతినేని. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన సినిమా ఇది. మహేష్ బాబు దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. రామ్ ఇమేజ్ కి భిన్నంగా సాగే సినిమా ఇది. ఒక హీరోకి వీరాభిమాని పాత్రలో కనిపించనున్నాడు రామ్. ఇదొక ఫ్యాన్ బయోపిక్. సూపర్ స్టార్ పాత్రలో ఉపేంద్ర కనిపించడం ఆసక్తికరం. ఈ సినిమా విజయం అటు రామ్ కి చాలా కీలకం.
మొత్తానికి నవంబర్ బరిలో అన్నీ వెరైటీ సినిమాలే వున్నాయి. మరి ఇందులో బాక్సాఫీసుని సందడిగా మార్చే సినిమాలెన్నో చూడాలి.