చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలు ఫామ్ లోకి వచ్చేశారు. అల్లు అర్జున్, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల పై ఎలాంటి బెంగా లేదు. ఎందుకంటే వాళ్లు కెరీర్ని స్ట్రాంగ్ గానే బిల్డ్ చేసుకొంటూ వెళ్తున్నారు. కానీ యువ హీరోల్లో కొంతమంది మాత్రం హిట్టు కోసం ఇంకా ఎదురు చూపులు చూస్తూనే ఉన్నారు. శర్వానంద్ ఇటీవలే సంక్రాంతికి వచ్చి ఓ సూపర్ హిట్టు కొట్టాడు. యంగ్ హీరో ఖాతాలో హిట్ పడితే ఆ వైబ్ ఎలా ఉంటుందో శర్వాని చూస్తే అర్థమవుతూనే ఉంది. అలాంటి హిట్ వైబ్ కోసం చాలామంది హీరోలు ఎదురుచూస్తున్నారు.
ఈ జాబితాలో ముందు చెప్పుకోవాల్సిన పేరు.. నితిన్. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా, సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోల్లో నితిన్ ఒకడు. తన కెరీర్ ని బాగా బిల్డ్ చేసుకొన్నాడు. ఆ తరవాత వరుస ఫ్లాపులు పడ్డాయి. నితిన్ పని అయిపోయిందనుకొన్న తరుణంలో ఇష్క్ తో మళ్లీ విజయాల బాట పట్టాడు. ఎంటర్టైన్మెంట్ సినిమాలకు కేరాఫ్ గా నిలిచాడు. అలాంటి నితిన్ కెరీర్ ఇప్పుడు తిరోగమనం దిశగా సాగుతోంది. ఎన్నో ఆశలు పెట్టుకొన్న రాబిన్ వుడ్, తమ్ముడు లాంటి చిత్రాలు కూడా బోల్తా పడ్డాయి. ఇప్పుడు తనకు హిట్ చాలా అవసరం. ప్రస్తుతం వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది తనకు డూ ఆర్ డై లాంటి సెట్యువేషన్ లో నెట్టిన సినిమా. మళ్లీ పంజా విప్పాలంటే.. ఈ సినిమాతో నిరూపించుకోవాల్సిందే.
రామ్ కెరీర్ కూడా ఇంచు మించు ఇలానే ఉంది. మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకొన్న రామ్ కెరీర్ ఇప్పుడు తిరోగమనం దిశగా సాగుతోంది. డబుల్ ఇస్మార్ట్, స్కంధ భారీ ఫ్లాపులు మూటగట్టుకొన్నాయి. ఆంద్రా కింగ్ తాలుకా కూడా గట్టెక్కించలేదు. ఇప్పుడు ఆర్కా మీడియా బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తన కెరీర్ లో చాలా కీలకంగా మారింది.
యూత్ ని థియేటర్లకు రప్పించే సత్తా ఉన్న హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకడు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సూపర్ హిట్లు తన ఖాతాలో ఉన్నాయి. అయితే మళ్లీ అలాంటి హిట్ ఇప్పటి వరకూ పడలేదు. కింగ్ డమ్ సైతం అభిమానుల్ని నిరాశ పరిచింది. అంతకు ముందు తీసిన లైగర్ అయితే.. తన కెరీర్ ని పది మెట్లు కిందకి దించింది. ఇప్పుడు ‘రౌడీ జనార్థన’, ‘రణబాలి’ తన చేతిలో ఉన్నాయి. రెండూ డిఫరెంట్ జోనర్ సినిమాలే. భారీ బడ్జెట్ తో రూపొందుతున్నాయి. ఈ సినిమాలతో తాను కమ్ బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ కూడా గట్టిగా కోరుకొంటోంది. మనకున్న ప్రతిభావంతమైన హీరోల్లో విశ్వక్ సేన్ ఒకడు. తనదైన రోజున మార్కెట్ ని షేక్ చేయగలడు. కానీ ఈమధ్య కొన్ని తప్పటడుగులు వేశాడు. అందులోంచి బయటకు రావడానికి ‘ఫంకీ’ దోహదపడాలని చాలామంది కోరుకొంటున్నారు. ఒకప్పుడు లవ్ స్టోరీలకు పెద దిక్కుగా నిలిచిన నాగ శౌర్య సినిమా చేసి చాలా కాలం అయ్యింది. తనకు కూడా ఓ హిట్ చాలా అవసరం. మెగా హీరోల్లో డీసెంట్ ట్రాక్ రికార్డ్ ఉన్న వరుణ్ తేజ్ సైతం హిట్ కోసం కచోర పక్షిలా ఎదురు చూస్తున్నాడు. ‘కొరియన్ కనకరాజు’ తన లాస్ట్ హోప్.
యంగ్ హీరోలంతా హిట్ బాట పడితే.. పరిశ్రమ కళకళలాడుతుంది. కొత్త దర్శకులు, కొత్త నిర్మాతలకు కొండంత భరోసా దొరుకుతుంది. హిట్ అనేది వాళ్లకు మాత్రమే కాదు.. ఇండస్ట్రీకి కూడా చాలా చాలా అవసరం. ఈ యేడాది వీళ్లంతా హిట్ బాట పడితే అంతకంటే కావాల్సిందేముంది?
