‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదలకు సిద్ధమవుతున్న వేళ.. ఓ కీలకమైన మార్పు జరిగింది. దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ వచ్చి చేరాడు. ఈ మార్పు విషయంలో చిత్రబృందం కూడా అధికారిక ప్రకటన చేసింది. వెసులుబాటు కోసమే ఈ మార్పు అంటూ ప్రకటించింది. ఈనెల 26న ఈ సినిమా రావాలి. అయితే ఓ వారం ముందు వచ్చే అవకాశం ఉంది. అంటే.. తమన్ చేతిలో కనీసం 15 రోజుల సమయం కూడా లేదు. దేవిశ్రీ ప్రసాద్ ఆర్.ఆర్ కొంత ఫినిష్ చేశారు. దాదాపు సగం సినిమా పూర్తి చేసి ఉండొచ్చు. మిగిలిన సగం సినిమా ఇప్పుడు తమన్ కంప్లీట్ చేయాలి.
చేతిలో తక్కువ సమయం ఉండడం ఒక ఎత్తయితే.. సినిమాని అర్థం చేసుకొని, ఆ ఫ్లోని కొనసాగించడం మరో ఎత్తు. సాధారణంగా సంగీత దర్శకుడు కథ, స్క్రిప్టు దగ్గర్నుంచి ప్రయాణం మొదలెడతారు. సినిమా కథేమిటి.. పాత్రల తీరు తెన్నులేంటి? ఏ సమయంలో ఏ పాత్ర ఎలా ప్రవర్తిస్తుంది? వీటిపై సంగీత దర్శకులకు పూర్తి స్థాయి అవగాహన అవసరం. అప్పుడే నేపథ్య సంగీతం కూడా కథలో భాగం అవ్వగలుగుతుంది. కొన్ని కొన్ని సార్లు ఒక్కో ఎపిసోడ్ కోసం వారాలు, నెలల సమయం తీసుకొంటారు సంగీత దర్శకులు. ఇప్పుడు అంత సమయం లేనే లేదు. ఉన్నదాంట్లో బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వాలి. పైగా అప్పటికే సగం సినిమాకు ఆర్.ఆర్ అయిపోయింది. మిగిలిన సగం దానికి కంటిన్యుటీగా ఉండాలి తప్ప.. ఎక్కడ్నుంచో తెచ్చి అతికించినట్టు ఉండకూడదు. సంగీత దర్శకులు పాటల్లో కొన్ని ట్రాక్స్… ఆర్.ఆర్‌లో వాడుతుంటారు. పాటలూ, ఆర్ ఆర్ ఒక్కరే అందిస్తే ఆ పని మరింత ఈజీ అవుతుంది. కానీ ఇక్కడ అలాంటి వెసులుబాటు లేదు. దేవి ట్యూన్ చేసిన పాటల్లోని బీజియమ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో తమన్ వాడే అవకాశమే లేదు. అంటే.. తమన్ కొత్తగా వాటిని రికార్డ్ చేయాల్సిందే.
ఆర్.ఆర్ అనేది ఇప్పుడు చిన్న విషయం ఏమీ కాదు. సినిమా రిజల్ట్ ఆర్.ఆర్‌పై ఆధారపడుతోంది. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలకు. ఈ విషయంలో తేడా జరిగితే సీన్ ఎన్హాన్స్ అవ్వదు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్ని దాటుకొని, `ఉస్తాద్`ని పూర్తి చేయాలి. అయితే ఇది వరకు కొన్ని సినిమాలకు ఇలాంటి ఆపధర్మ సంగీత దర్శకుడిగా తన బాధ్యతల్ని నిర్వహించిన అనుభవం తమన్ కి ఉంది. ‘పుష్ప 2’లో కొన్ని ట్రాకులు తమన్ అందించినవే. కాబట్టి తమన్ ఈ పని ఈజీగా చేయగలడని టీమ్ భావిస్తోంది. మరి తమన్ ఏం చేస్తాడో, తన పై పెట్టిన ఈ గురుతర బాధ్యత ఎలా నెరవేరుస్తాడో?
