బీహార్ రాజకీయాల్లో రెండు దశాబ్దాల నితీష్ యుగం ముగిసి, సామ్రాట్ చౌదరి రూపంలో ఒక నవశకం ఆరంభం అవుతోంది. గత రెండు దశాబ్దాలుగా నితీష్ కుమార్ పాలనలో బీహార్ కొంత మేర శాంతిభద్రతలను మెరుగుపరుచుకున్నప్పటికీ, పారిశ్రామికంగా, ఆర్థికంగా ఆశించిన స్థాయిలో ఎదగలేకపోయింది. లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలో అరాచకత్వం రాజ్యమేలితే, నితీష్ హయాంలో స్తబ్దత ఆవరించింది. ఫలితంగా బీహార్ ఇతర రాష్ట్రాలకు కూలీలను సరఫరా చేసే రాష్ట్రంగా మిగిలింది.
మేధావుల గడ్డ.. కూలీల అడ్డా
దేశంలో అత్యధికంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను అందిస్తున్న రాష్ట్రాల్లో బీహార్ ఒకటి. నలంద విశ్వవిద్యాలయం వంటి చారిత్రక వారసత్వం ఉన్న ఈ గడ్డపై తెలివితేటలకు కొదువ లేదు. కానీ, ఇక్కడి మేధస్సు ఇతర రాష్ట్రాల అభివృద్ధికి ఉపయోగపడుతోంది తప్ప, సొంత రాష్ట్రం భాగ్యరేఖను మార్చలేకపోతోంది. సరైన మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు లేకపోవడం వల్లే బీహార్ లేబర్ సప్లయింగ్ స్టేట్ గా ముద్రపడింది. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడులోని ఫ్యాక్టరీలు, నిర్మాణ రంగం బీహార్ కూలీల శ్రమపైనే నడుస్తున్నాయంటే, అక్కడ ఉపాధి కల్పన ఏ స్థాయిలో విఫలమైందో అర్థం చేసుకోవచ్చు.
సామ్రాట్ చౌదరి ముందున్న సవాళ్లు
కొత్త ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ముందు ఇప్పుడు పర్వతమంత సవాలు ఉంది. నితీష్ కుమార్ లా కేవలం మనుగడ రాజకీయం చేయకుండా, అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని నడిపించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. ముఖ్యంగా వ్యవసాయాధారిత పరిశ్రమలను ప్రోత్సహించడం, గంగా నదీ పరివాహక ప్రాంతాన్ని పారిశ్రామిక కారిడార్‌గా మార్చడం ఆయన ప్రాధాన్యతలు కావాలి. బీహార్ ఎదుర్కొంటున్న అతిపెద్ద శాపం వలసలు’. ఇతర రాష్ట్రాలకు వెళ్లే శ్రమశక్తిని అక్కడే ఆపగలిగితేనే ఆయన నాయకత్వానికి సార్థకత లభిస్తుంది.
వెనుకబాటుతనం అనే ముద్ర చెరిగిపోవాలి
జాతీయ స్థాయిలో ఏదైనా వెనుకబడిన ప్రాంతాన్ని ఉదాహరణగా చెప్పాలంటే మొదట గుర్తొచ్చే పేరు బీహార్. ఈ అప్రతిష్టను పోగొట్టడం సామ్రాట్ చౌదరి ప్రధాన లక్ష్యం కావాలి. కేంద్రంలో తనకున్న పట్టును ఉపయోగించుకుని భారీ పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, స్థానిక యువతకు ఉపాధి కల్పించే స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను నిర్మించాల్సి ఉంటుంది. విద్యావంతులైన బీహారీలు ప్రపంచవ్యాప్తంగా రాణిస్తున్నప్పుడు, వారందరినీ మళ్ళీ రాష్ట్రం వైపు చూసేలా చేయడమే నవ బీహార్ నిర్మాణానికి తొలి అడుగు.
రాజకీయ అధికారం మారినంత మాత్రాన వ్యవస్థలు మారవు. కానీ, మారిన నాయకత్వం గనుక పాత వాసనలను వదిలి, ఆధునిక ఆలోచనలతో ముందుకెళ్తే బీహార్ అద్భుతాలు సృష్టించగలదు. బీహార్ గనుక బాగుపడితే, అది భారతదేశపు జీడీపీని మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయం.
