జగన్ రెడ్డి నంది అంటే నంది.. పంది అంటే పంది అంటామని.. ఆయన కోసం ఆత్మాహుతి దళం మాదిరిగా పని చేస్తామని ఎంపీ మిథున్‌రెడ్డి ఓ టీవీచానల్ ఇంటర్యూలో చేసిన వ్యాఖ్యల వైసీపీ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. జగన్ రెడ్డి తీరుపై సొంత తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. రక్తసంబంధీకులే ఆయన మోసగాడు అంటూంటే.. ఆయన కోసం ఆత్మాహుతి దళం అని మిథున్ రెడ్డి వింత వ్యాఖ్యానాలు చేస్తున్నారు.
వైసీపీలో అంతా ఆర్థిక అవసరాలు, పెయిన్ బ్యాచ్
స్వయంగా మిథున్‌రెడ్డి బీజేపీలోకి వెళ్లేందుకు దారులు వెతుక్కుంటున్నారు. జగన్ రెడ్డి ఆయన కోసం పడి చచ్చేవారు ఎవరూ లేరు. చుట్టూ ఉన్నది కేవలం ఆర్థిక అవసరాలు ఉన్న వారు, పెయిడ్ బ్యాచ్ మాత్రమే. సిద్ధాంతాల పట్ల నిబద్ధతతో కాకుండా, కేవలం అధికారం ఉన్నప్పుడు లబ్ధి పొందిన వారు, వేరే చోట అవకాశాలు లేని వారు మాత్రమే ప్రస్తుతం ఆయన వెంట కనిపిస్తున్నారు.
వాలంటీర్లతోనే పునాదులు కదిలిపోయాయి!
జగన్ కు నిజంగా ప్రజాదరణ ఉంటే, ప్రతి చిన్న కార్యక్రమానికి భారీగా జన సమీకరణ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. ప్రజల నుంచి స్వచ్ఛందంగా మద్దతు లభించకపోవడం వల్లే, స్క్రిప్ట్ ప్రకారం టూర్లు, అద్దె మనుషులతో సభలు నిర్వహించాల్సి వస్తోందనేది కాదనలేని సత్యం.వాలంటీర్ల వ్యవస్థను నమ్ముకుని సొంత పార్టీ కార్యకర్తలను విస్మరించడం జగన్ చేసిన అతిపెద్ద తప్పు. ఏళ్ల తరబడి పార్టీ జెండా మోసిన కార్యకర్తలను కాదని, ప్రభుత్వ జీతం తీసుకునే వాలంటీర్లపై ఆధారపడటంతో పార్టీ సంస్థాగత పునాదులు కదిలిపోయాయి. కార్యకర్తలకు గుర్తింపు లేని చోట పార్టీ మనుగడ కష్టమని ఎన్నికల ఫలితాలు నిరూపించినా జగన్ లో మార్పు రాలేదు.
రాజకీయంగా వేరే దారి లేని వారు మాత్రమే జగన్ వెంట
ఆర్థిక లావాదేవీలు, కేసుల విషయంలో జగన్ తో విడదీయలేని ముడి ఉన్న మిథున్ రెడ్డి వంటి వారు మాత్రమే ఆయనకు ఆత్మాహుతి దళ సభ్యులుగా మిగిలారు. మద్యం స్కామ్ వంటి కేసుల్లో ఈడీ విచారణలు ఎదుర్కొంటున్న తరుణంలో, జగన్ ను వెనకేసుకురావడం వారి వ్యక్తిగత, ఆర్థిక అవసరం. ఉగ్రవాద మనస్థత్వాన్ని తలపించేలా ఆత్మాహుతి దళం వంటి పదజాలం వాడటం జగన్ కు సంతృప్తిని ఇవ్వవచ్చు కానీ, సామాన్య ప్రజల్లో ఇది తీవ్ర అసహ్యానికి దారితీస్తోంది.
జగన్‌ను ఎవరు నమ్ముతారు?
సొంత కుటుంబ సభ్యుల నమ్మకాన్ని కోల్పోయిన జగన్ రెడ్డి, రాజకీయ ప్రయోజనాల కోసం తన వెంట నడిచే కొద్దిమంది నేతల మాటలనే వేద వాక్కులుగా భావిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. అధికారం కోల్పోయాక కార్యకర్తలు దూరమై, కేవలం ఆర్థిక ప్రయోజనాలు ఉన్న వారు మాత్రమే చుట్టూ చేరిన ఈ పరిస్థితి జగన్ రాజకీయ పతనానికి నిదర్శనం. నిరంతరం భయంతో, అనుమానంతో బతికే నాయకుడికి ఆత్మాహుతి దళాల అవసరం ఉండవచ్చు కానీ, ప్రజల ఆదరణ ఉన్న నాయకుడికి ప్రజా బలమే రక్ష. ప్రజలను నమ్మని జగన్ కు అలా అనిపించడం లేదు.
