మీ ఏడుపే నా ఎదుగుదల అని కొంత మంది ఆటోలు, లారీల వెనుక రాసుకుంటూ ఉంటారు. అది ఓ రకంగా నిజమే. రాజకీయాల్లో ఇంకా ఎక్కువ. రేవంత్ రెడ్డి ఓ వైపు హైకమాండ్ లో భాగం అవుతూంటే..ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే జీవన్ రెడ్డి లాంటి నేతలు ఆయనపై ఏడుస్తున్నారు. రేవంత్ రెడ్డి ఒక ఉడుము లా పార్టీలోకి వచ్చి అందరినీ తొక్కుకుంటూ వెళ్తున్నారని అంటున్నారు. నిజానికి రేవంత్ లేకపోతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది కాదని అందిరకీ తెలిసిన వాస్తవం.
షెడ్డుకు వెళ్లిన పార్టీని బతికించిన వైనం
కేసీఆర్ హయాంలో కాంగ్రెస్ పార్టీ దాదాపు ఉనికిని కోల్పోయే పరిస్థితికి చేరుకుంది. వరుసగా రెండుసార్లు ఓటమి, ఎమ్మెల్యేల ఫిరాయింపులతో పార్టీ కేడర్ డీలా పడిపోయింది. ఆ సమయంలో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం ఒక టర్నింగ్ పాయింట్. జీవన్ రెడ్డి వంటి సీనియర్లు ఉన్నప్పటికీ, కేడర్లో ఉత్సాహం నింపడంలో వారు విఫలమైన చోట రేవంత్ తన దూకుడుతో పార్టీని మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్లారు. కేసీఆర్ అజేయుడు అనుకుంటున్న తరుణంలో, ఆయనను ఢీకొనే దమ్మున్న నాయకుడిగా రేవంత్ తనను తాను నిరూపించుకున్నారు.
మునుగోడు.. ఒక అగ్నిపరీక్ష
రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని దెబ్బతీయడానికి సొంత పార్టీ వారే ప్రయత్నించారు. రేవంత్ కు పీసీసీ చీఫ్ పదవి ఇచ్చారని పార్టీ ఉనికి దెబ్బతీయడానికి మునుగోడు ఉపఎన్నిక తెచ్చేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ పీక పిసికేయాలని చూసినప్పుడు, రేవంత్ ఒంటరి పోరాటం చేశారు. అప్పుడు సీనియర్లు ఎంతవరకు సహకరించారనేది బహిరంగ రహస్యం. ఆ ఉపఎన్నికలో గెలవకపోయినా, పార్టీ ఓటు బ్యాంకును కాపాడుకుని, ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడం రేవంత్ రెడ్డి వ్యక్తిగత చరిష్మా , వ్యూహ చతురతకు నిదర్శనం.
ఓటమి భారమా.. పదవీ వ్యామోహమా?
జీవన్ రెడ్డి వంటి సీనియర్లు ఓడిపోయినప్పుడు పార్టీ వారిని గౌరవించలేదని వాదించడం సహజమే కావచ్చు. కానీ, రాజకీయం ఎప్పుడూ వర్తమానం, భవిష్యత్తుపై ఆధారపడి ఉంటుంది. రేవంత్ రెడ్డి పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు. పదవి రానప్పుడు ఆవేశపడటం కంటే, పార్టీ గెలుపులో తన వంతు పాత్రను వెతుక్కోవడం సముచితం. ఆయనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు.. ఎంపీ టిక్కెట్ కూడా ఇచ్చారు. కేవలం ఆయన స్థానంలోగెలిచిన ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకున్నారు. దాంతో తన రాజకీయ జీవితం ముగిసిపోతుందన్న భయంతో రెబలయ్యారు.
సీనియారిటీ కాదు..స్ట్రెంత్ ముఖ్యం
రేవంత్ రెడ్డిని ఉడుము అని సంబోధించడం ద్వారా ఆయన పట్టుదలను జీవన్ రెడ్డి పరోక్షంగా ఒప్పుకున్నట్లే కనిపిస్తోంది. ఎందుకంటే ఆ పట్టుదలే కాంగ్రెస్ను పదేళ్ల వనవాసం తర్వాత గద్దెనెక్కించింది. రాజకీయాల్లో సీనియారిటీ కంటే విజయం కే ఎక్కువ విలువ ఉంటుంది. తన సీటు కిందకు నీళ్లు తేచ్చారన్న కోపంతో జీవన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అసంతృప్తిని ప్రతిబింబించవచ్చు కానీ, సామాన్య కార్యకర్తకు మాత్రం రేవంత్ రెడ్డి ఒక ఆశాకిరణం అని అనుకోవచ్చు.
