Tribanadhari Barbarik Movie Review
తెలుగు రేటింగ్: 2.25/5
రివైంజ్ డ్రామా అనేది ఎప్పటికీ సేలబుల్ పాయింటే. సినిమాల్లో ఈ ఫార్ములాకు తిరుగులేదు. అందుకే ప్రతీ నాలుగు కథల్లో ఒకటి.. రివైంజ్ స్టోరీ అయి తీరుతుంటుంది. ఒకరికి జరిగిన అన్యాయం.. దానిపై తీర్చుకొనే ప్రతీకారం – ఈ కథలకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. సరిగ్గా చెప్పాలే కానీ, ఎన్నిసార్లయినా బోర్ కొట్టకుండా ఈ పాయింట్ పై కథలు చెప్పొచ్చు. కాకపోతే… ఈ జోనర్లో ఎక్కువ సినిమాలు వచ్చాయి కాబట్టి, కథనంలో కాస్తయినా వెరైటీ చూపించాల్సిందే. ‘త్రిబాణధారి బార్బరిక్’ కూడా రివైంజ్ స్టోరీనే. దాన్ని థ్రిల్లర్ గా మలిచే ప్రయత్నం చేసింది చిత్రబృందం. విజయవంతమైన ఈ ఫార్ములా.. ఈ బార్బరిక్ పట్టుకోగలిగాడా? ఓ రివైంజ్ స్టోరీకి ఇతిహాసాల టచ్ ఉన్న ఇలాంటి టైటిల్ పెట్టడానికి గల కారణం ఏమిటి?
డా.శ్యామ్ (సత్యరాజ్) ఓ మానసిన వైద్య నిపుణులు. తనకో మనవరాలు. పేరు… నిధి. తల్లిదండ్రులు లేకపోవడంతో నిధిని అల్లారు ముద్దుగా పెంచుతాడు శ్యామ్. అయితే ఆగస్టు 15న స్కూలుకి వెళ్లిన నిధి… మళ్లీ తిరిగి రాదు. తన మనవరాలి కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంటాడు శ్యామ్. మరోవైపు.. రామ్ (వశిష్ట సింహా), దేవ్ (క్రాంతి కిరణ్) ఇద్దరూ స్నేహితులు. రామ్ అమెరికా వెళ్లాలనుకొంటాడు. దేవ్ జూదానికి బానిసై అప్పుల పాలవుతాడు. ఇద్దరికీ డబ్బు కావాలి. అందుకే అడ్డదారులు తొక్కైనా ఆ డబ్బు సంపాదించాలనుకొంటారు. కనపడకుండా పోయిన నిధికీ, వీరిద్దరికీ సంబంధం ఏమైనా ఉందా? మనవరాలి ఆచూకీ కోసం అన్వేషిస్తున్న తాతయ్యకు ఎలాంటి అవరోధాలు ఏర్పడ్డాయి? త్రిబాణధారి బార్బరిక్ స్ఫూర్తితో శ్యామ్ ఈ ఆటంకాల్ని ఎలా అధిగమించాడు? అనేదే కథ.
బార్బరిక్ అనేది భారతంలోని ఓ పాత్ర. కురుక్షేత్ర సంగ్రామాన్ని మూడంటే మూడే బాణాలతో ముగించగల ధీశాలి. అతని ఇతి వృత్తాన్ని అక్కడక్కడ చెబుతూ – ఆ పురాణ గాథని మనవరాలి ఆచూకీ కోసం అన్వేషించే ఓ తాతయ్య కథకు ముడి పెట్టారు. ఇలా పురాణ పాత్రని సింబాలిక్ గా తీసుకొని, ఓ కథ చెప్పాలన్న ఆలోచన బాగుంది. దాని వల్ల ఈ రివైంజ్ డ్రామాకు కొత్త సొబగు అబ్బింది. నిధి మిస్సింగ్ కేసుతో కథ మొదలవుతుంది. సమాంతరంగా రామ్, దేవ్ ల కథ సాగుతుంటుంది. వాళ్ల కోరికలు, అందుకోసం పడే పాట్లు ఇవన్నీ తెరపై చూపించుకొంటూ వెళ్లాడు దర్శకుడు. వశిష్ట కోసం ఓ పాట ఇరికించడం వల్ల… ఫస్టాఫ్‌లో కాస్త బిగి తగ్గింది. ఇలాంటి కథలకు పాటలతో పని లేదు. వాటికి వీలైనంత స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. అక్కడక్కడ నిధికి ఏమైందో అన్న కంగారు మొదలవుతుంది. కొన్ని చోట్ల.. దర్శకుడు కావాలనే అలాంటి ఫీలింగ్ ప్రేక్షకులకు కలిగేలా చేశాడు. అలాంటి ట్రిక్స్ ఈ సినిమాకు అవసరం లేదు. ఫస్టాఫ్‌లో కొంత ట్రిమ్మింగ్ అవసరం అనిపించింది. పద్మక్క పాత్రలో ఉదయభాను కనిపించడం కొత్తగా ఉంది. అయితే.. ఆమె పాత్రకు అనుకొన్నంత స్కోప్ లేదు. నిజానికి ఈ పాత్రని పక్కన పెట్టి చూసినా కథలో ఎలాంటి మార్పూ ఉండదు. ఉదయభాను కోసం కొన్ని సీన్లు, ఓ పాట పెంచుకొంటూ పోవడం వల్ల ఇంకాస్త లెంగ్త్ పెరిగింది.
ద్వితీయార్థం కథనం కాస్త వేగవంతమైంది. ఎప్పుడైతే సత్యరాజ్ రివైంజ్ మూడ్ లోకి వెళ్లాడో అక్కడి నుంచి కథనం మరింత రక్తి కట్టింది. ఇలాంటి కథల్లో క్లైమాక్స్ లో ఓ ట్విస్ట్ ఊహిస్తాడు ప్రేక్షకుడు. అలాంటి ట్విస్ట్ ఉంది కూడా. అక్కడ ఇంకో లేయర్ ఓపెన్ అవుతుంది. అప్పటి వరకూ కాస్త బలహీనంగా కనిపించిన వశిష్ట పాత్రకు కొత్త ఊతం దొరికినట్టైంది. క్లైమాక్స్ లో ప్రధానమైన విలన్ ని అంతం చేసే ఎపిసోడ్ అంతగా కుదర్లేదు. ఇలానే ఎందుకు జరగాలి? అనేదానికి దర్శకుడు ఏదో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసినా, అది సంతృప్తికరంగా అనిపించదు. త్రిబాణధారి బార్బరిక్ పాత్రకూ, ఈ కథకూ దర్శకుడు ఇచ్చిన లింక్ కూడా కన్వెన్సింగ్ గా అనిపిస్తుంది. ఆమధ్య వచ్చిన ‘మహారాజా’ స్థాయిలో తీయాల్సిన సినిమా ఇది. ఆ స్కోప్ కథలో ఉంది. కథనం మరింత బిగితో రాసుకోవాల్సిన అవసరం ఉంది.
సత్యరాజ్ది కీలమైన పాత్ర. తన అనుభవం చూపించారు. బార్బరిక్ తో పోల్చదగిన పాత్ర కాబట్టి.. ఆ స్థాయిలో ఫైర్ ఉండాల్సింది. సత్యరాజ్ ఓ మానసిక వైద్యుడు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఓ మానసిక వైద్యుడు ఎలా ఆలోచిస్తాడో ఆ పాత్ర అలా ఆలోచిస్తుంది. బార్బరిక్ లా వేగం, తెగువ కనిపించవు. అది కాస్త లోటు. వశిష్ట పాత్రని ముందు దర్శకుడు తన ఇష్టమొచ్చినట్టు తీర్చిదిద్దాడు. అయితే క్లైమాక్స్ కి వెళ్లే కొద్దీ ఆ పాత్ర బలపడుతుంటుంది. వశిష్టని సీరియస్ కోణంలోనే చూశాం. తనలో రొమాన్స్, డాన్సింగ్ టాలెంట్ కూడా ఈ సినిమాతో చూపించే ప్రయత్నం చేశారు. ఉదయభాను ని ఇలా చూడడం కొత్తగా ఉంది. ఆమె గెటప్ బాగుంది. అయితే.. ఈ పాత్రని ఇంకాస్త పవర్ ఫుల్ గా తీర్చిదిద్దాల్సింది. సత్యం రాజేష్‌కు కాస్త నిడివి ఉన్న పాత్ర దొరికింది. ఈ పాత్ర కూడా కథకు చాలా కీలకంగా మారింది.
నిర్మాణ విలువలు కనిపించాయి. తాత మనవరాళ్ల మధ్య సాగే గీతం బాగుంది. సాహిత్య పరంగా కూడా ఆకట్టుకొంది. అయితే ఇలాంటి సినిమాల్లో పాటలు పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రధ మార్థం ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉంటే బాగుండేది. ద్వితీయార్థంలో ఉన్న వేగం అక్కడా చూపిస్తే గమనం వేరేలా ఉండేది. స్క్రీన్ ప్లేలో ఇంకాస్త మ్యాజిక్ జరగాల్సింది. ప్రతీ సన్నివేశానికీ సమయం చూపిస్తూ.. ముందుకూ వెనక్కీ వెళ్లడం అంత మంచి స్క్రీన్ ప్లే అనిపించుకోదు. ఏది ముందు జరిగిందో, ఏది ప్రస్తుతం నడుస్తున్న సన్నివేశమో తెలీక ప్రేక్షకులు కాస్త కన్ఫ్యూజన్ కి గురయ్యే ప్రమాదం ఉంది.
మొత్తంగా చూస్తే.. ఓ థ్రిల్లర్‌కు పురాణ పాత్రతో లింక్ పెట్టి ఆలోచించడం కొత్తగా అనిపించింది. అక్కడక్కడ కొన్ని మెరుపులు తగిలాయి. ప్రీ క్లైమాక్స్ ఆకట్టుకొంటుంది. దర్శకుడు ఇంకాస్త తెలివిగా ఆలోచించి, ప్రేక్షకుల మెదడుకు పని కల్పించి ఉండగలిగితే.. బార్బరిక్ మరో.. మహారాజ్ అయ్యేది. అయితే కొన్ని లూజ్ ఎండ్స్, ఇంకొన్ని కన్వీనియన్స్ సన్నివేశాలు రాసుకోవడం వల్ల ఆ స్థాయికి వెళ్లలేదు. కాకపోతే.. మరీ తీసి పారేయాల్సిన సినిమా కూడా కాదు. కథలో విషయం ఉంది. చాలా చోట్ల దర్శకుడి నిజాయితీ కనిపించింది. దాన్ని మరింత సమర్థవంతంగా చూపించాల్సింది.
తెలుగు రేటింగ్: 2.25/5