హారిక హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్ హోమ్ బ్యానర్లు. కేవలం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాలు చేయడానికే హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ని కేటాయించారు నిర్మాత చినబాబు. ఇక సితారలో వచ్చే సినిమాల విషయంలో కూడా త్రివిక్రమ్ సూపర్ విజన్ వుంటుంది. ప్రతి సినిమా కథ, స్క్రిప్ట్ కి త్రివిక్రమ్ అంగీకార ముద్రపడాల్సిందే. తాజాగా వస్తున్న స్వాతిముత్యం సినిమాకి కూడా త్రివిక్రమ్ స్టాప్ పడింది. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర దర్శకుడు లక్ష్మణ్ కృష్ణ వెల్లడించారు. త్రివిక్రమ్ స్వాతిముత్యం స్క్రిప్ట్ చదివి అంగీకార ముద్రవేశారని చెప్పుకొచ్చారు.
”నేను త్రివిక్రమ్ కి పెద్ద ఫ్యాన్ ని. ఇండస్ట్రీకి రావడానికి కారణం కూడా ఆయనే. అతడు సినిమా నాపై బలమైన ముద్రవేసింది. ఈ సినిమా చూసిన తర్వాత నా లక్ష్యం సినిమా అని నిర్ణయించుకున్నా. స్వాతిముత్యం విషయంలో త్రివిక్రమ్ గారిని కలిశాను. ”కథని చక్కగా రాశావు. నేను కరెక్షన్స్ చేయాల్సిన అవసరం లేదు. చాలా ఫ్రెష్ గా వుంది. సెట్స్ కి వెళ్లిపోవచ్చు” అని చెప్పారు.స్వాతి ముత్యం కథ ఆయనకి నచ్చడం చాలా ఆనందంగా వుంది” అని చెప్పుకొచ్చాడు లక్ష్మణ్ కృష్ణ. అక్టోబర్ 5న స్వాతిముత్యం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.