ముందస్తుపై ఈసీ ముందు ఎవరి వాదన వారిది..!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై.. ఎన్నికల సంఘం ప్రత్యేక బృందం రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలను సేకరించింది. పార్టీలన్నీ తమ తమ వాదనలను బలంగానే వినిపించాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు అఘమేఘాలపై నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఎన్నికలు నిర్వహించడానికి తొందరమేమీలేదని ఆ పార్టీ నేత మర్రి శశిధర్‌రెడ్డి లఖిత పూర్వకంగా ఈసీకి తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆరు నెలల సమయం ఉందని గుర్తు చేశారు. పాత షెడ్యూల్‌ప్రకారమే ఓటర్ల సవరణ చేయాలని.. ఆ తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. తప్పు చేస్తే ఎన్నికల కమిషన్‌కు అప్రతిష్ట వస్తుందని… అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించిన మరో ముఖ్యమైన అంశం.. భద్రాచలం నియోజకవర్గం వ్యవహారం. ఇందులోని ఏడు మండలాలు…ఏపీలో కలిశాయి. దీనిపై ఏదో ఒకటి తేల్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలన్నారు.

తెలుగుదేశం పార్టీ, లెఫ్ట్ కూడా.. దాదాపుగా.. కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేసిన అభిప్రాయాలనే వ్యక్తం చేశాయి. ఉన్న పళంగా.. మిన్ను విరిగి మీద పడినట్లు.. ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదని చెప్పాయి. అయితే.. టీఆర్ఎస్ మాత్రం.. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ఈసీ బృందానికి విజ్ఞప్తి చేసింది. ఆపద్ధర్మ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండకుండా… త్వరగా ఎన్నికలు నిర్వహించాలని టీఆర్ఎస్ తరపున హాజరైన ఎంపీ వినోద్ కోరారు. విభజన చట్టం ప్రకారం సెక్షన్‌108కింద…భద్రాచలం నియోజకవర్గంపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారని వినోద్ ప్రకటించారు. దీనిపై మళ్లీ కాంగ్రెస్‌నేతలే మాట్లాడటం ఆశ్చర్యకరమన్నారు. అయితే.. ఈ నియోజకవర్గంపై… ఆ ఏడు మండలాల ఓటర్లపై… ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన లేదు.

టీఆర్ఎస్‌ వాదనకు మజ్లిస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కోరినట్లు అసదుద్దీన్ తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు… మొహర్రం, వినాయక చవితి పండుగల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ఇతర రాష్ట్రాల ఎన్నికల కంటే ముందే…తెలంగాణ శాసనసభకు ఎన్నికలు నిర్వహించాలన్నారు. మొత్తానికి తెలంగాణలో అధికారపక్షం.. అధికార వ్యతిరేక పక్షాల మధ్య చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. వీలైతే వచ్చేవారం ఎన్నికలు పెట్టేయమని టీఆర్ఎస్ పక్షం తేల్చేస్తూండగా… విపక్షం మాత్రం .. ఆరు నెలలు గడువు ఉండగా.. పరుగులు పెట్టడం ఎందుకని ప్రశ్నిస్తోంది. ఎవరెన్ని చేసినా.. ఈసీ మాత్రం స్వతంత్రంగా ఏ నిర్ణయమూ తీసుకునే పరిస్థితిలో లేదన్న విమర్శలు ఉండనే ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com