అభ్యర్థుల విషయంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ “ఒక్కటే”..!

తెలంగాణలో జరగనున్న మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో.. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకే రకంగా ఆలోచించాయి. అభ్యర్థులను.. ఒకే తీరుగా ఎంపిక చేశాయి. ఎక్కడా సామాజిక న్యాయం అనే ప్రశ్నకు తావు లేకుండా… అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్.. ఒకే సామాజికవర్గానికి.. మూడు స్థానాలు ఇచ్చేశాయి. కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న మగ్గురూ రెడ్డి సామాజికవర్గం వారే. టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న వారు కూడా.. అదే సామాజికవర్గానికి చెందిన వారు.

నల్గొండ స్థానిక సంస్థ ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థిగా తేరా చిన్నపరెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయనకు పోటీగా కాంగ్రెస్ నుంచి … కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మీరెడ్డిని బరిలోకి దింపారు. వరంగల్ స్థానిక సంస్థల నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పేరును ఖరారు చేయగా.. కాంగ్రెస్ నుంచి ఇనుగాల వెంకట్రామిరెడ్డికి బీఫాం ఇచ్చారు. ఇక రంగారెడ్డి జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున కొమ్ముూరి ప్రతాపరెడ్డి బరిలో దిగగా.. టీఆర్ఎస్ మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డికి చాన్సిచ్చింది. ఇక్కడ ఎమ్మెల్సీగా గతంలో.. ఆయన సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి ఉండేవారు. ఆయన రేవంత్ రెడ్డిపై గెలిచి.. అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఇప్పుడు తమ్ముడు స్థానాన్ని గెలుచుకునేందుకు అన్న పోటీ పడుతున్నారు.

రెండు పార్టీల్లో… రెడ్డి సామాజికవర్గానికే టిక్కెట్లు ఖరారు చేయడానికి…చాలా కారణాలున్నాయి. రంగారెడ్డి లో పట్నం మహేందర్ రెడ్డి అయితే గెలుపు సులువు అవుతుందని కేసీఆర్ భావించారు. పట్నంను ఢీకొట్టాలంటే… కొండా విశ్వేశ్వర్ రెడ్డి అండ ఉన్న నేతకి టిక్కెట్ ఇవ్వాలని కాంగ్రెస్ అనుకుంది. అలాగే చేశారు. ఇక వరంగల్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.. రంగారెడ్డి జిల్లాకు చెందినవారు. కానీ ఆయన కేటీఆర్‌కు సన్నిహితుడు. ఆయన తరపున వరంగల్ రాజకీయాలను చక్కబెట్టారు. అందుకే అక్కడ చాన్సిచ్చారు. ఇక కాంగ్రెస్ తరపున పోటీకి ఎవరూ ముందుకు రాలేదు. కొడా దంపతులను పోటీచేయించాలని భావించినప్పటికి వారు సుముఖత వ్యక్తం చేయలేదు. గత ఎన్నికల్లో పరకాల నుంచి టికెట్ అశించి భంగపడ్డ ఇనుగాల వెంకట్రామిరెడ్డిని కాంగ్రేస్ చివరకు ఫైనల్ చేసింది. మొదటినుంచి పార్టీలో ఉన్న నాయకుడు కావడంతో ఇప్పటి వరకు ఎలాంటి అవకాశాలు కూడా రాకపోవడంతో చివరికి ఆశల్లేని టిక్కెట్ ఖరారు చేశారు.

నిజానికి ఎన్నికలు ఒక్క నల్గొండ కు మాత్రమే కాంగ్రెస్‌లో పోటీ ఏర్పడింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అధికార పార్టీ ని తట్టుకుని నిలబడాలంటే రాజగోపాల్ రెడ్డి కుంటుంబం నుంచే మరో మారు అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయింది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం వల్ల వచ్చిన స్థానం కావడం, ఆర్థికంగా బలమైన నాయకుడు కావడంతో ఆయన భార్య లక్ష్మీని బరిలో నిలపడానికి టీపీసీసీ ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది. ఇక టీఆర్ఎస్ తరపున… తేరా చిన్నపరెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరేటప్పుడు… నాగార్జున సాగర్ అసెంబ్లీ, నల్లగొండ లోక్ సభ టిక్కెట్లు ఆశ పెట్టారు. ఏదీ కాకపోవడంతో.. ఇప్పుడు ఎమ్మెల్సీ టిక్కెట్ ఇచ్చారు. అలా ఎవరి కారణాలు వారు చూసుకుని… అందరూ.. ఒకే సామాజికవర్గానికి చాన్సిచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com