ఢిల్లీలో తెరాస ఆఫీస్‌… జాతీయ రాజ‌కీయాల కోస‌మేనా..?

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇప్పుడు పూర్తిగా జాతీయ రాజ‌కీయాల‌పై దృష్టి సారించార‌నే సంగ‌తి తెలిసిందే. రాష్ట్రంలో మంత్రివ‌ర్గ కూర్పు కూడా పూర్తి చెయ్య‌కుండానే… జాతీయ రాజకీయాల కూర్పు కోసం ఆయ‌న ప‌ర్య‌ట‌న‌లు మొద‌లుపెట్టారు. అయితే, ఈ దిశ‌గా కేసీఆర్ తీసుకున్న మ‌రో నిర్ణ‌యం ఏంటంటే… దేశ రాజ‌ధాని ఢిల్లీలో తెరాస కార్యాల‌యం ఏర్పాటు! దీనికి సంబంధించిన వివ‌రాల‌తో తెరాస తాజాగా ఒక ప్రెస్ నోట్ కూడా విడుద‌ల చేసింది. ఢిల్లీలో పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేయాల‌నీ, దాన్ని ఏ ప్రాంతంలో నిర్మిస్తే బాగుంటుంద‌నే అంశంపై తెరాస ఎంపీల నుంచి అభిప్రాయాలు కోరారు. దీనిపై ఎంపీల‌దే తుది నిర్ణ‌యం అవుతుంద‌ని స‌మాచారం. సంక్రాంతి పండుగ నాటికే శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం ఢిల్లీలో ఉంటుంద‌నీ, అనంత‌రం మూడు నెలల్లో… అంటే, లోక్ స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌డానికి వీలైనంత ముందుగానే ఆఫీస్ నిర్మాణం కూడా పూర్తి చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు స‌మాచారం. అంటే, ఇక‌పై ఢిల్లీ నుంచే కేసీఆర్ రాజ‌కీయాలు చేస్తార‌ని అర్థం చేసుకోవ‌చ్చు. అక్క‌డే ఆఫీస్ పెట్టుకుని, పూర్తిస్థాయిలో రంగంలోకి దిగేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్న‌ట్టుగా క‌నిపిస్తోంది.

నిజానికి, జాతీయ రాజ‌కీయాలంటే కేసీఆర్ మొద‌ట్నుంచీ చెబుతున్న‌ది ఏంటంటే… కొన్ని పార్టీల‌ను క‌లిపి ఒక ఫ్రెంట్ ఏర్పాటు చేయ‌డం కాద‌నే క‌దా! అంటే, జ‌న‌తా పార్టీ త‌ర‌హాలో త‌న పాలిటిక్స్ ఉంటాయ‌ని ఆ మధ్య చెప్పారు. కాంగ్రెస్‌, భాజ‌పాల‌కు ప్ర‌త్యామ్నాయంగా ఒక పార్టీ ఏర్పాటు త‌న ల‌క్ష్యం అన్న‌ట్టుగానే ఇంత‌వ‌ర‌కూ సంకేతాలు ఇస్తూ వ‌చ్చారు. అయితే, ఇత‌ర పార్టీల మ‌ద్ద‌తు కోసం కేసీఆర్ ప్ర‌స్తుతం కొన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల్ని క‌లుసుకున్న సంగ‌తీ తెలిసిందే. కానీ, ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్‌, భాజ‌పాల‌ను కాద‌ని.. కేసీఆర్ అజెండాతో క‌లిసి ముందుకు సాగుదామ‌నే ప‌రిస్థితిలో ఏ ఇత‌ర పార్టీలూ సంసిద్ధం కాలేని పరిస్థితి.

కాబ‌ట్టి, ఎన్నిక‌ల ముందుగానే తాను అనుకుంటున్న జాతీయ అజెండా ఏదో.. దాన్ని కేసీఆర్ ప్ర‌జ‌ల ముందు ఉంచాల్సిన అవ‌స‌రం క‌నిపిస్తోంది. ఒక ఉమ్మ‌డి మేనిఫెస్టో కూడా త‌యారు చేస్తామ‌ని ఆ మ‌ధ్య చెప్పారు. అంటే, ఎన్నిక‌ల ముందుగానే త‌న ప్ర‌య‌త్న‌మేదో కేసీఆర్ మొద‌లుపెట్టాలి. తరువాతి పరిస్థితులను నిర్ణయించేది… ఆయా పార్టీలు గెల్చుకున్న ఎంపీ సీట్లే. ఇప్పుడు ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని వీలైనంత త్వ‌ర‌గా నిర్మించ‌డం వెన‌కున్న వ్యూహం కూడా అదే అయి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com