అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా నుంచి దిగుమతులపై అదనంగా 100 శాతం టారిఫ్‌లు విధించారు. నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. చైనా అరుదైన ఖనిజాల ఎగుమతులపై నియంత్రణలు ప్రకటించింది. ఇవి అమెరికా సైనిక, సెమీకండక్టర్ పరిశ్రమలకు కీలకం. దీన్ని ట్రంప్ తట్టుకోలేకపోతున్నారు. చైనా నియంత్రణలు అమెరికా AI చిప్స్, సాఫ్ట్వేర్ ఎగుమతుల్ని నియంత్రిస్తుందని ఇది జాతీయ భద్రతకు ముప్పు అని ట్రంప్ చెప్పుకొస్తున్నారు. అరుదైన ఖనిజాల ఉత్పత్తులపై చైనా ఆధిపత్యం వహిస్తోంది. ప్రపంచంలో 90 శాతం అరుదైన ఖనిజాలు చైనానే ఉత్పత్తి చేస్తోంది.
ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాక ముందు అంతా సవ్యంగానే ఉండేది. పద్దతి ప్రకారం నడిచేది. కానీ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత గుడ్డిగా టారిఫ్‌లే ఆయుధం అంటూ చెలరేగిపోవడంతో చైనా కూడా సరైన విధంగా బుద్ది చెబుతూ వస్తోంది. మొదట్లో వందల శాతాల టారిఫ్‌లు విధించిన ట్రంప్ ..తర్వాత కాళ్లు, గడ్డాలు పట్టుకుని ఎలాగోలా 30 శాతానికి ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ చైనా తమకు అవసరమైన ఖనిజాలను ఎగుమతి చేయకుండా ఆపుతోందని టారిఫ్‌లు ఆయుధం ప్రయోగిస్తున్నారు.
చైనాపై ఎన్ని టారిఫ్‌లు వేసినా అమెరికా ప్రజలకే నష్టం. టారిఫ్‌లు US ఇంపోర్టర్లు చెల్లిస్తారు. చైనా ఉత్పత్తులు ఇతర దేశాల నుంచి లభించడం కష్టం. లభించినా ధరలు ఎక్కువగా ఉంటాయి. వాటికి ప్రత్యామ్నాయాలు లేకపోవడంతో అమెరికా ప్రజలపై భారం పడుతుంది. ట్రంప్ ప్రకటన తర్వాత డౌ జోన్స్ 879 పాయింట్లు , S&P 500 2.71 శాతం, నాస్డాక్ 3.56 శాతం పడిపోయాయి. ఈ పతనం ఇంకా కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.
ప్రపంచ దేశాలతో వాణిజ్యం విషయంలో ట్రంప్.. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. తమ దేశానికి అవసరమైన వాటిని దిగుమతి చేసుకుంటున్నామన్న స్పృహ కూడా లేకుండా.. ఆ వస్తువులతో. ఇతర దేశాలను బతికిస్తున్నామని ఫీలవుతున్నారు. అక్కడే సమస్య వస్తోంది. ట్రంప్ టారిఫ్‌ల పేరుతో ప్రతి రోజూ సొంత ప్రజలకు కొరడా దెబ్బలు కొడుతున్నారు.