అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై నాలుగు బాంబులేసి.. సర్వనాశనం చేసేశారని చెబుతున్నారు. ఆ దేశాన్ని ఆర్థికంగా కుంగదీశామని ప్రకటించుకున్నారు. నిజానికి ఆయన. ఇరాన్ కు లేనిపోని ఆయుధాలను ఇచ్చారు. హార్మూజ్ జలసంధిలోనే ఆ ఆయుధాలు ఉన్నాయి. ప్రపంచ చమురు రవాణాలో సుమారు 20 నుండి 30 శాతం వాటా కలిగిన హార్ముజ్ జలసంధిపై ఇరాన్ సాధించిన పట్టు ఇప్పుడు అగ్రరాజ్యాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కేవలం ఈ ఒక్క సన్నని సముద్ర మార్గాన్ని మూసివేసినా , అక్కడ ఉద్రిక్తతలు సృష్టించినా ప్రపంచ ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే, గల్ఫ్ దేశాల సంపదకు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇరాన్ ఒక చోక్ పాయింట్ దగ్గర కాపలా కూర్చుంది.
ఇంటర్నెట్ – గ్లోబల్ కనెక్టివిటీపై ముప్పు
ఆధునిక ప్రపంచం ఇంటర్నెట్ కేబుల్స్ పై ఆధారపడి ఉంది. ఇరాన్ తీర ప్రాంతాల మీదుగా వెళ్లే సముద్రగర్భ కేబుల్స్ ద్వారానే ఆసియా, ఐరోపా మధ్య సమాచార మార్పిడి జరుగుతుంది. ఇరాన్ తన సైనిక సామర్థ్యంతో ఈ కేబుల్స్‌ను దెబ్బతీయగలదని సంకేతాలు ఇవ్వడం ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలను భయపెడుతోంది. సైబర్ దాడుల్లో కూడా ఇరాన్ అగ్రశ్రేణి దేశాలతో పోటీ పడుతోంది. అమెరికా ఆంక్షలు ఇరాన్‌ను ఏకాకిని చేయాలని చూస్తే, ఇరాన్ తన భౌగోళిక ఉనికిని వాడుకుని ప్రపంచాన్ని ఏకాకిని చేస్తానని బెదిరిస్తోంది.
గల్ఫ్ దేశాలపై పెత్తనం – ప్రాంతీయ బలం
యుద్ధం వల్ల ఇరాన్ బలహీనపడకపోగా, లెబనాన్, సిరియా, యెమెన్, ఇరాక్ వంటి దేశాల్లో తన ప్రాక్సీ బలగాలను మరింత బలోపేతం చేసుకుంది. సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాల చమురు క్షేత్రాలపై దాడులు చేసే సామర్థ్యాన్ని ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపులు నిరూపించుకున్నాయి. దీంతో, ఒకప్పుడు అమెరికా అండ చూసుకుని ఇరాన్‌ను లెక్క చేయని గల్ఫ్ దేశాలు, ఇప్పుడు ఇరాన్‌తో రాజీ పడటమే మేలనే ధోరణికి వస్తున్నాయి. ఖతార్ ఇప్పటికే ఇరాన్‌పై దాడులకు వ్యతిరేకమని ప్రకటించింది. చైనా మధ్యవర్తిత్వంతో ఇరాన్-సౌదీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అమెరికా రక్షణ కవచం కంటే ఇరాన్ ఆగ్రహం ప్రమాదకరమని ఆ దేశాలు గుర్తించాయి.
నాశనమా.. లేక బలోపేతమా?
ట్రంప్ ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారన్నది వాస్తవమే కావచ్చు, కానీ రాజకీయంగా, సైనికంగాఇరాన్ మరింత ప్రమాదకరంగా మారింది. ఇప్పుడు అమెరికాను చూసి ప్రపంచం భయపడటం లేదు కానీ, ఇరాన్ ఏదైనా సాహసం చేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందనే ఆందోళన మాత్రం ప్రతి దేశంలోనూ కనిపిస్తోంది.
ఇరాన్‌ను లొంగదీసుకోవడానికి అమెరికా అనుసరించిన కఠిన వైఖరి వికటించింది. ఇరాన్ ఇప్పుడు ఒక ప్రాంతీయ శక్తిగా మాత్రమే కాక, ప్రపంచ ఇంధన, సమాచార వ్యవస్థలను నియంత్రించగల గ్లోబల్ డిస్ట్రప్టర్‌గా అవతరించిందనేది నిజం.


