అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాంగ విధానం ఇప్పుడు ఒకే ఒక అంశం చుట్టూ తిరుగుతోంది.. అదే సుంకాల ఆయుధం. గ్రీన్ లాండ్ నుండి ఇరాన్ వరకు, రష్యా నుండి చైనా వరకు ప్రతి దేశాన్ని తన దారికి తెచ్చుకోవడానికి ఆయన సుంకాలను బెదిరింపు అస్త్రంగా వాడుతున్నారు. అయితే, ఈ మొండి పట్టుదల ప్రపంచ దేశాల కంటే ఎక్కువగా అమెరికా సొంత ప్రజల మీదనే ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఇతర దేశాలను దండించే క్రమంలో ట్రంప్ విధిస్తున్న ఈ సుంకాలు, వాస్తవానికి అమెరికా వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతున్నాయి.
అవసరం లేకుండా అమెరికా దిగుమతి చేసుకుంటోందా?
అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్దది అయినప్పటికీ, అది ఒక అపారమైన దిగుమతుల సామ్రాజ్యం. నిత్యావసర వస్తువులైన దుస్తులు, చెప్పుల నుండి అత్యాధునిక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, సెమీకండక్టర్ చిప్స్ , ఔషధాల వరకు అమెరికా విదేశీ సరఫరాదారుల పైనే పూర్తిగా ఆధారపడుతోంది. ముఖ్యంగా టెక్నాలజీ రంగానికి వెన్నెముక లాంటి రేర్ ఎర్త్ మినరల్స్ కోసం చైనా వైపు చూడక తప్పని పరిస్థితి. అమెరికాలో తయారీ రంగం క్షీణించి, కేవలం సర్వీస్ సెక్టార్‌పై దృష్టి పెట్టడం వల్ల ఇప్పుడు చిన్న స్క్రూ డ్రైవర్ కావాలన్నా చైనా లేదా మెక్సికో నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ భారీ డిపెండెన్సీ వల్లే, ట్రంప్ విధిస్తున్న సుంకాలు విదేశీ కంపెనీల కంటే, ఆ వస్తువులను కొనే సామాన్య అమెరికన్ పౌరుడికే భారంగా మారుతున్నాయి.
సుంకాల పెంపు అంటే సొంత ప్రజలకు వాతలు పెట్టడమే !
సుంకాల పెంపు వల్ల దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి, ఫలితంగా అమెరికాలో ద్రవ్యోల్బణం మళ్ళీ కోరలు చాస్తోంది. సామాన్య అమెరికన్ ప్రజలు నిత్యావసరాల ధరలు పెరగడంతో తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. తాము కట్టే సుంకాలు ఇతర దేశాలు చెల్లిస్తున్నాయని ట్రంప్ వాదిస్తున్నప్పటికీ, ఆ భారం అంతిమంగా స్థానిక కొనుగోలుదారుల పైనే పడుతోందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. తన దేశ ప్రయోజనాల కోసమే అని చెప్తున్నా, క్షేత్రస్థాయిలో ప్రజలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు.
చేతనైంది చేసుకోమంటున్న ప్రపంచదేశాలు
గతంలో ట్రంప్ బెదిరింపులకు భయపడిన ప్రపంచ దేశాలు ఇప్పుడు డోంట్ కేర్ అనే ధోరణిని అవలంబిస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ నుంచి ఆసియా దేశాల వరకు అన్నీ ప్రతిఘటనకు సిద్ధమవుతున్నాయి. ట్రంప్ సుంకాల వ్యూహం కేవలం అంతర్జాతీయ సంబంధాలను దెబ్బతీయడమే కాకుండా, అమెరికాను ప్రపంచ వాణిజ్య రంగంలో ఒంటరిని చేసే ప్రమాదం కనిపిస్తోంది. ఆర్థిక వాస్తవాలను విస్మరించి కేవలం అహంకారపూరిత నిర్ణయాలతో ముందుకు వెళ్లడం వల్ల అమెరికా నష్టపోవడం ఖాయంగా కనిపిస్తోంది.


