బెదిరింపులకు భారత్ లొంగిపోతుందని .. భారత మార్కెట్ ను దోచేసుకుందామని ప్లాన్ చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నకు భారత ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. ఎన్ని సుంకాలు వేసుకుంటావో వేసుకో అన్నట్లుగా నింపాదిగా వ్యవహరిస్తోంది. రష్యాతో కానీ.. లేదా ఇతర తమ వ్యాపార ఆసక్తుల విషయంలో అమెరికాకు తలొగ్గే ప్రశ్నే లేదని మాటలతో కాకుండా చేతలతో సంకేతాలు ఇస్తోంది.
భారత్ ను ఇంత కాలం తక్కువగా అంచనా వేసిన ట్రంప్.. తాను ఏది చెబితే దానికి తలూపుతారని అనుకున్నారు. ట్రేడ్ డీల్ పేరుతో బెదిరించి .. అమెరికా ఉత్పత్తులను చివరికి నాన్ వెజ్ పాలను కూడా భారత మార్కెట్లోకి డంప్ చేయడానికి ప్రయత్నించారు. కానీ భారత్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. చివరికి రష్యా వద్ద ఆయిల్ కొనకుండా చేసి.. తమ వద్ద కొనేలా చేసుకోవాలని అనుకున్నారు. భారత్ దానికీ సిద్ధంగా లేదు. దాంతో.. సుంకాలు ఇంకా పెంచుతానని రెచ్చిపోతున్నారు.
భారత్ పూర్తిగా తెగించేసింది. ట్రంప్ పిచ్చితనంతో ఏం చేసుకున్నా.. చేసుకోవచ్చని సంకేతాలు పంపుతోంది. ఎన్ని సుంకాలు పెంచుకుంటారో పెంచుకోండన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇలాగే చైనాతో వ్యవహరించి చివరికి చైనా కాళ్లు పట్టుకున్నంత పని చేశాడు ట్రంప్. ఇప్పుడు భారత్ పై అదే చేస్తున్నాడు. అయితే భారత్ మాత్రం ట్రంప్ పిచ్చికి పోటీగా వ్యవహరించడం లేదు. సంయమనంతో వ్యవహరిస్తోంది. ప్రతీకార సుంకాలు విధించబోమని.. తమ పాలసీల ప్రకారమే పన్ను లు ఉంటాయని అంటున్నారు.
అదే సమయంలో రష్యాతో భారత్ సంబంధాలను బలోపేతం చేసుకుంటున్నారు. అమెరికా వరుసగా అన్ని దేశాలపై పన్నులు విధించడం వల్ల ఆ దేశంపై ఆధారపడే వారి సంఖ్య తగ్గిపోతుంది. దాని వల్ల డాలర్ విలువ కోల్పోతుంది. అమెరికా .. ప్రపంచ పెద్ద హోదాను కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది.