ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ తన ఇష్టదైవమైన కొండగట్టు అంజన్న పట్ల తనకున్న భక్తిని మరోసారి చాటుకున్నారు. జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా సుమారు 35.19 కోట్ల రూపాయల భారీ నిధులను మంజూరు చేయించారు.
గతంలో ఎన్నికల ప్రచార సమయంలో జరిగిన ఒక విద్యుత్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు పవన్ కళ్యాణ్ . ఆ రోజు స్వామివారే తనను కాపాడారని, కొండగట్టు అంజన్న తనకు పునర్జన్మ ప్రసాదించాడని బలంగా నమ్ముతారు. అందుకే తన ప్రతి రాజకీయ అడుగును ఇక్కడి నుంచే ప్రారంభిస్తుంటారు. ఈ క్రమంలోనే తనకు ఇష్టమైన క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో టీటీడీ అధికారులతో సంప్రదింపులు జరిపి నిధుల విడుదలకు కృషి చేశారు.
టీటీడీ మంజూరు చేసిన ఈ నిధులతో కొండగట్టు క్షేత్రంలో భక్తులకు అవసరమైన కనీస సౌకర్యాలను మెరుగుపరచనున్నారు. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం 96 నుండి 100 గదులతో కూడిన భారీ సత్రాన్ని నిర్మించనున్నారు. అలాగే, ఏటా హనుమాన్ జయంతి సందర్భంగా వేలాదిగా తరలివచ్చే మాలధారుల సౌకర్యార్థం సుమారు 2,000 మందికి సరిపడా భారీ దీక్షా విరమణ మండపాన్ని నిర్మిస్తారు వీటితో పాటు తాగునీరు, క్యూలైన్ల నిర్వహణ వంటి మౌలిక వసతులపై ఈ నిధులను ఖర్చు చేయనున్నారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు ప్రకటించినప్పటికీ నిధులు విడుదల కద్దు. పవన్ చొరవను కేంద్ర మంత్రి బండి సంజయ్ సహా ఇతర నేతలు అభినందించారు.
