కామేపల్లి తులసిబాబుతో టీడీపీకి ఏంసంబంధం లేదని ఆయన పార్టీ సభ్యుడు కాదని టీడీపీ అధికారికంగా ప్రకటించింది. రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ కు గురి చేసిన కేసులో అరెస్ట్ అయిన తులసీబాబు తాను తెలుగుదేశం పార్టీ అని చెప్పుకుంటున్నారు. తాను పోలీస్ స్టేషన్ కు వచ్చిన రోజున చంద్రబాబు, లోకేష్, ఎన్టీఆర్ ఫోటోలతో స్టిక్కర్లు వేసుకుని ర్యాలీగా వచ్చారు. పోలీసులపై రుబాబు చేశారు. దాంతో ఆయనను పద్దతిగా అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు.
ఈ క్రమంలో ఆయన టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు సన్నిహితుడన్న ప్రచారం జరిగింది. ఆయన కూడా గుంటూరు జైలుకు వద్దకు వచ్చి గంట సేపు తులసిబాబుతో మాట్లాడి వెళ్లారు. అయితే ఆయన టీడీపీ సభ్యుడా కాదా అన్నదానిపై సందిగ్ధం ఉంది. వైసీపీ హయాంలో ఆయన ఆ పార్టీ సానుభూతిపరుడు. టీడీపీ హయాంలో వెనిగండ్లతో కలిసి టీడీపీ సానుభూతిపరుడు అయ్యాడు. నిజానికి ఆయన ఇటీవల పార్టీ నిర్వహించిన సభ్యత్వం నమోదులో కూడా పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేసుకోలేదు. అంటే ఎలాంటి సభ్యుడు కాదు. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ అధికారికంగా ప్రకటించింది.
టీడీపీ పేరుతో ఆయన గుడివాడలో దందాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన టీడీపీ నేతగానే చెలామణి అవుతున్నారు. ఆయనకు పార్టీతో సంబంధంలేదని అధికారికంగా ప్రకటించడంతో ఇక గుడివాడ ఎమ్మెల్యే కూడా ఆయనను దూరం పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.