నన్ను టార్గెట్ చేస్తున్నారు.. ఈ విజయ్‌కు ఒక్క చాన్స్ ఇస్తారా? అని ప్రజల్ని అడగడం ప్రారంభించారు టీవీకే విజయం. భార్య విడాకుల కోసం కోర్టుకెక్కిన తర్వాత తొలిసారి తంజావూరులో పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి అందులో మాట్లాడారు. కుటుంబ వివాదం గురించి ఆయన మాట్లాడలేదు కానీ రాజకీయాల్లో మాత్రం ఆయన కాన్ఫిడెన్స్ తగ్గిపోయిందన్న సంకేతాలు మాత్రం ఈ సభలో కనిపించాయి.
తనను స్టాలిన్ టార్గెట్ చేస్తున్నారని పదే పదే ఆరోపణలు చేశారు. ఇప్పటి వరకూ జన నాయగన్ సినిమాపై ఆయన మాట్లాడలేదు. ఇప్పుడు ఆ సినిమా విడుదల ఆగిపోవడానికి కూడా స్టాలినే కుట్ర చేశారని అంటున్నారు. నిజానికి అది సెంట్రల్ బోర్డు ఆఫ్ సర్టిఫికేషన్ వివాదం. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదు. ఇంకా చెప్పాలంటే ఈ వివాదంలో స్టాలిన్ విజయ్ కు మద్దతుగా నిలిచారు. అయినా సరే డీఎంకేను దుష్టశక్తితో పోల్చిన విజయ్ తీవ్ర విమర్శలు చేశారు.
విజయ్ మెల్లగా ఎన్నికల ప్రచారంలో వేగం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయనకు వరుసగా ఆటంకాలు ఎదురవుతున్నాయి. కరూర్ లో తొక్కిసలాట జరిగి పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగినప్పటి నుండి ఆయనపై క్రేజ్ తగ్గుతూ వస్తోందని సర్వే నివేదికలు వెల్లడిస్తున్నాయి. భార్య చేసిన వివాహేతర బంధం ఆరోపణలతో ఆయన మానసికంగా ఇబ్బంది పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు.