తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ తన తమిళగ వెట్రి కళగం పార్టీ ద్వారా ప్రకటిస్తున్న ఉచితాల వరద ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి స్టాలిన్ అమలు చేస్తున్న పథకాలకు రెట్టింపు ప్రయోజనాలు కల్పిస్తామన్న ఆయన హామీలు అటు ఆకర్షణీయంగా కనిపిస్తున్నా, ఇటు విమర్శలకు పదును పెడుతున్నాయి. విజయ్ అనుసరిస్తున్న ఈ వ్యూహం రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ఒకవైపు ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నా, మరోవైపు ఆయన రాజకీయ పరిణతిని ఇది ప్రశ్నార్థకం చేస్తోంది.
ఆయనకేం తెలుసని ఇలాంటి హామీలు ఇస్తున్నారు?
కనీసం వార్డు మెంబర్గా కూడా అనుభవం లేని విజయ్, నేరుగా ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసి ఇలాంటి భారీ హామీలు ఇవ్వడంపై మేధావి వర్గాల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పరిపాలనా అనుభవం సున్నా అయిన వ్యక్తి, రాష్ట్ర ఖజానాపై పడే వేల కోట్ల భారాన్ని ఎలా మేనేజ్ చేస్తారనేది ప్రధాన ప్రశ్న. స్టాలిన్ ప్రభుత్వం ఇప్పటికే అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు కష్టపడుతుంటే, విజయ్ అంతకు రెట్టింపు ఇస్తాననడం అసాధ్యమైన హామీ గా ప్రజలు భావించే ప్రమాదం ఉంది. ఇది ఆయనను ఒక ‘సీరియస్ పొలిటీషియన్ గా కాకుండా, కేవలం ఓట్ల కోసం ఆశ చూపే సినిమా గ్లామర్ నేతగా ముద్ర వేసే అవకాశం ఉంది.
ఉచిత పథకాలపై యువతలో అసంతృప్తి
విజయ్ పార్టీపై యువతలో ఉన్న ప్రధాన ఆశ మార్పు . దశాబ్దాలుగా ద్రవిడ పార్టీల మధ్య నలిగిపోతున్న తమిళనాట ఒక కొత్త రాజకీయ సంస్కృతి వస్తుందని ఆశించిన వారికి, ఈ ఉచితాల ప్రకటనలు తీవ్ర నిరాశను కలిగిస్తున్నాయి. ఇతర రాజకీయ నాయకులలాగే విజయ్ కూడా ఉచితాలనే నమ్ముకోవడం వల్ల, ఆయన ప్రత్యేకత ఏముందనే ప్రశ్న తలెత్తుతోంది. మార్పు కోరుకునే ఓటర్లు కేవలం డబ్బు లేదా వస్తువుల కోసం ఓటు వేయరు. వారు వ్యవస్థాగత మార్పును కోరుకుంటారు. ఈ క్రమంలో విజయ్ తనకున్న యూత్ ఐకాన్ ఇమేజ్ను కోల్పోయి, పాతతరం రాజకీయాలనే పునరావృతం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అధికారం కోసం దేనికైనా తెగిస్తారా?
అధికారమే పరమావధిగా ఆయన దేనికైనా తెగిస్తున్నారనే సంకేతాలు వెళ్తున్నాయి. కేవలం గెలవడమే లక్ష్యంగా ఇలాంటి హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక నిధులు లేవు అనే సాకుతో చేతులెత్తేస్తారేమో అన్న భయం సామాన్యుల్లో కలగడం సహజం. డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి బలమైన క్యాడర్ ఉన్న పార్టీలను ఢీకొట్టాలంటే ఈ మాత్రం షో ఉండాలని విజయ్ వర్గం వాదిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రజలు ఆయన మాటల్లోని నిజాయితీని ఎంతవరకు నమ్ముతారన్నదే ఇక్కడ అసలు పాయింట్. తమిళ రాజకీయాల్లో ఉచితాలు అనేవి గెలుపు గుర్రాలుగా మారిన చరిత్ర ఉంది. అందుకే ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టకూడదనే పట్టుదలతో ఆయన పథకాల వరద పారిస్తున్నారు. అయితే, సినిమా స్క్రిప్ట్ లాగా హామీలు ఇవ్వడం సులభం కానీ, బడ్జెట్ అంకెలను సరితూచడం కష్టమనే నిజాన్ని ఆయన త్వరలోనే గ్రహించాల్సి ఉంటుంది.
