సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రెండున్నర గంటల పాటు చర్చించారు. ఇది పూర్తిగా రాజకీయ అంశాలపై జరిగిన సమావేశంగా జనసేన, టీడీపీ వర్గాలు చెబుతున్నారు. అధికారికంగా ఈ భేటీ గురించి ఎలాంటి ప్రకటన రాలేదు. లడ్డూ అంశంపై క్లీన్ చిట్ వచ్చినట్లుగా వైసీపీ చేసుకుంటున్న ప్రచారాన్ని కూటమి గట్టిగా తిప్పికొట్టలేకపోయిందన్న అభిప్రాయం ఉండటంతో.. తదుపరి వ్యూహంపై చర్చించినట్లుగా చెబుతున్నారు. అలాగే రాజ్యసభ ఎన్నికలపై.. ఇటీవల ఢిల్లీ పర్యనటలో అమిత్ షాతో జరిగిన చర్చల్లో వచ్చిన అంశాలపైనా మాట్లాడుకున్నట్లుగా చెబుతున్నారు.
రాజ్యసభ అభ్యర్థుల అంశంపైనా అధినేతలిద్దరూ సుదీర్ఘంగా చర్చించారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి అమిత్ షాతో జరిపిన చర్చల వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో కూటమి పక్షాలైన జనసేన , బీజేపీలకు ఇచ్చే ప్రాధాన్యతపై వీరిద్దరూ ఒక ప్రాథమిక అవగాహనకు వచ్చారు. జనసేన తరపున ఒక అభ్యర్థిని పంపే విషయంలో చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు, అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.
అదే సమయంలో కొన్ని చేరికల విషయంలోనూ చర్చించినట్లుగా చెబుతున్నారు. వైసీపీ నుంచి కొంత మంది మంచి ఇమేజ్ ఉన్న నేతలు పార్టీలోకి వచ్చేందుకు సంకేతాలు పంపుతున్నారని.. వారి విషయంలో ఎలా స్పందించాలన్నది కూడా చర్చించినట్లుగా చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు వచ్చే వారం ప్రారంభం కానున్నాయి. వైసీపీ హాజరయ్యే అవకాశం లేదు కాబట్టి.. ఆ పార్టీ వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి రాజ్యాంగపరంగా తీసుకోవాల్సిన చర్యలపైనా మాట్లాడుకున్నట్లుగా తెలుస్తోంది.
